Devotional

కాలానికి కూడా అందని రహస్యం…పరమాత్మ

కాలానికి కూడా అందని రహస్యం…పరమాత్మ

ఇప్పుడు టైమ్‌ ఎంత అనే ప్రశ్నకు చిన్న పిల్లవాడు కూడా సమాధానం చెప్పగలడు. కానీ టైమ్‌ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానానికై మనం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. గడియారంలో కనిపించేది టైమ్‌కు నిర్వచనం కాదు.

మనకు మూడురకాల జ్ఞానాలు, అనగా అనుభవాలు కలుగుతుంటాయి. ఒకటి మనం ఉన్న ప్రదేశం, చూసే ప్రదేశం గూర్చిన జ్ఞానం. రెండోది ఒక వస్తువు నుంచి మరొక వస్తువును, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరుచేసి గుర్తించే జ్ఞానం. మూడోది ఈ రెండు అనుభవాల మధ్య ఉన్న అంతరం (గ్యాప్‌) గురించిన జ్ఞానం. ఉదయం కాఫీ తాగాం, తొమ్మిది గంటలకు ఉపహారం తీసుకున్నాం, ఈలోగా పేపర్‌ చదవడం వంటి మిగతా అనుభవాలున్నా పైన చెప్పిన రెండింటి మధ్య ఉన్న అంతరం గురించిన అనుభవం ప్రముఖంగా ఉంటుంది. ఈ అంతరాన్నే రెండు ఘటనల మధ్య కాలం అంటున్నాం. కాబట్టి కాలమనేది ఒక అనుభవం. ఈ అనుభవాన్ని పొందడానికి ఒక వ్యక్తి ఉండాలి. కాలం అనేది మన తెలివిలో తెలియగలిగే ఒకానొక కల్పన, అనుభవం.

కాలం ఎప్పుడు ప్రారంభమైంది? దేవుడు సృష్టి ఎప్పుడు చేశాడో అప్పుడు ప్రారంభమైందని చెప్పవచ్చు. దేవుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు సృష్టించబడ్డాడు అన్నామంటే అతనికి ముందే కాలం ఉందనే అర్థం వస్తుంది. దేవుడికి పుట్టుక అంటూ లేదు అని ప్రపంచంలో అందరూ అంగీకరించేదే. దేవుడు అంటే మన ఉపనిషత సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి కాదు. కేవలం చైతన్యమే. అది ఎప్పటికీ ఉండేదే. చైతన్యం పుట్టింది అనడానికి వీల్లేదు. ఎందుకంటే చైతన్యం పుట్టింది అన్నప్పుడు దాన్ని గమనించే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటేనే దాన్ని గమనించగలడు. అందుకే చైతన్యాన్ని లేదా దేవుడిని అనాది అన్నారు. ఆ చైతన్యంలో కలిగే ఒకానొక మార్పు లేదా కనిపించే ఒకానొక దృశ్యాన్నే సృష్టి అన్నారు. ఆ మార్పును గమనించే చైతన్యాన్ని సృష్టికర్త అన్నారు. అందువల్ల కాలం అనేది చైతన్యంలో మార్పువల్ల కలిగే ఒకానొక వింత.

మరి సృష్టి ఎప్పుడు జరిగింది? దీనికి పాశ్చాత్య పండితులు తమ మతగ్రంథాన్ని పరిశీలించి 4004BCలో దేవుడు సృష్టి చేశాడని చెప్పారు. భగవద్గీత సృష్టిని అనాది (ఆది, ప్రారంభం అంటూ లేనిది) అంటుంది. ఏదో ఒక కాలంలో సృష్టి జరిగింది అంటే సృష్టికి పూర్వం దేవుడు ఖాళీగా ఉన్నాడా అనే ప్రశ్న వస్తుంది. ‘‘ఈశితవ్యాభావాత ఈశ్వరస్య అనీశ్వరత్వ ప్రసంగః’’ తాను శాసించడానికి ఏమీ లేనందువల్లే అతడిని శాసకుడు అనడానికి వీలులేకపోతుంది అని గీతాభాష్యంలో చూస్తాం. అందువల్ల సృష్టిని అనాది అనాలి.

మరి ఈ అనాది అయిన సృష్టిని కాలపరిమితిలోకి ఎలా తీసుకురావడం..? ఈ కాలాన్ని లెక్కపెట్టడానికి మన రుషులు చాలా కష్టపడ్డారు. ఎన్ని కోట్ల సంవత్సరాలు చెప్పినా అంతకుపూర్వం కూడా సృష్టి ఉందనే అర్థమే వస్తుంది. అందువల్లనే ఒకే ఒక సృష్టి అనికాకుండా చక్రక్రమంలో సృష్టి, స్థితి, లయ అనే రీతిలో అనేక సృష్టిలుంటాయి అన్నారు. ప్రతి సృష్టికీ ఒక సృష్టికర్త. సృష్టి, స్థితి, లయల సమయం అతని జీవితకాలం. తర్వాతి సృష్టికి మరొక సృష్టికర్త అన్నారు. మరి మొదటి సృష్టి ఏది అనేదానికి సమాధానం లేదు. ప్రస్తుతమున్న సృష్టిని గూర్చి అనేక బిలియన్‌ సంవత్సరాల సమయం చెప్పారు. భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో ఈ సృష్టి, స్థితి, లయల్ని వర్ణిస్తారు. మన పంచాంగాల్ని చూస్తే ప్రస్తుత సృష్టికర్త మధ్యవయస్సు దాటిన వ్యక్తి. దేవాలయంలో అర్చన సమయంలో పూజారి ‘అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే’ అంటూ చెప్పే మంత్రానికి ఇదే అర్థం. ప్రస్తుత సృష్టికర్త రెండవ పరార్థంలో ఉన్నాడట. పదికోట్ల కోట్ల సంవత్సరాలు ఒక పరార్థం. ఇటీవల జరిగిన అయుత చండీయాగం వల్ల అయుతం (పదివేలు) అర్థం తెలిసింది. అదేవరుసలో అనేక అంకెలను లెక్కిస్తే చిట్టచివరిది పరార్థం. ఒకటి పక్కన పదిహేడు సున్నాలు పెడితే అది పరార్థం. ప్రస్తుత సృష్టికర్త ఒక పరార్థం అయిపోయి, రెండో పరార్థంలో ఉన్నాడట.

శాస్త్రవేత్తలు సృష్టి గురించి చెబుతూ బిగ్‌బాంగ్‌ (గొప్ప విస్ఫోటనం) అనేది పద్నాలుగు బిలియన్ల సంవత్సరాల కిందట జరిగిందనీ, ఆ తర్వాత క్రమక్రమంగా నక్షత్రాలు, భూమండలం లాంటివి నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడ్డాయని చెబుతారు. అందుకే carl sagan అనే ఖగోళవేత్త cosmos అనే పుస్తకంలో ఇలా అన్నాడు.. ‘‘సృష్టిని గూర్చిన కాలగణనం (కాలాన్ని లెక్కించడం-time scale) కేవలం హిందూ మతంలో మాత్రమే ఆధునిక విజ్ఞానం చెప్పే కాలం లెక్కతో సరిపోలి ఉంది. ఈ కాలచక్రం మన మామూలు పగలు, రాత్రితో మొదలై సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పగలు, రాత్రి వరకు 8.64 బిలియన్ల సంవత్సరాల పరిమితిని చెబుతుంది. ఇది భూగోళం వయసు కంటే ఎక్కువ. మహా విస్ఫోటనం నుంచి ఇప్పటి వరకు జరిగిన కాలంలో సగం’’ ఇది మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.