Health

అనారోగ్యాన్ని ప్రేమించడంలో భారతీయులే ప్రథమం

అనారోగ్యాన్ని ప్రేమించడంలో భారతీయులే ప్రథమం

ఆరోగ్యంగా ఉండాలంటే మన అలవాట్లు సరిగా ఉండాలని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా మనవాళ్లు అస్సలు వినిపించుకోరు. దురలవాట్లలో మనమే ముందున్నామని ఇటీవలి సర్వేలో వెల్లడైంది. ఆల్కహాల్‌.., పొగాకు.. ఈ రెండు జంట అలవాట్లు ఫ్యాషన్‌కి మారుపేరుగా తయారయ్యాయి. అమ్మకాల విషయంలో ఈ రెండింటికీ ఉన్న ప్రాధాన్యం చెప్పనవసరం లేదు. ఒకవైపు కొవిడ్‌ స్వైరవిహారం చేస్తున్నప్పటికీ, లాక్‌డౌన్‌ సమయంలో కూడా వీటి అమ్మకాలు తగ్గలేదంటే ఈ అలవాట్లు మనవాళ్లను ఎలా పట్టి పీడిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండింటినీ అతిగా తీసుకునేవాళ్లలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన రాష్ట్రం కూడా ముందు వరుసలో ఉన్నాయని ఇటీవలి సర్వేలో తేలింది. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం పొగతాగడం ఎక్కువ శాతమున్న రాష్ర్టాల్లో తెలంగాణ, ఏపీ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక మద్యం విషయానికొస్తే రెండోస్థానంలో ఉన్నాయి. సిగరెట్లు ప్రభావం చూపించని అవయవమే ఉండదు. ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. గుండె బలహీనం అవుతుంది. మెదడులో కణితులు ఏర్పడొచ్చు. స్ట్రోక్‌ రావొచ్చు. ఇక ఆల్కహాల్‌ లివర్‌కి శత్రువు. ఈ అలవాట్ల వల్లనే మన దగ్గర కాన్సర్లు, గుండెజబ్బులు ఎక్కువ వుతున్నాయంటున్నారు నిపుణులు. వీటికి తోడు ఆహారపు అలవాట్లలో మార్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఎన్‌ఐఎన్‌ నిర్వహించిన ఈ సర్వే వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నది.