DailyDose

ఫేస్‌బుక్‌పై కాంగ్రెస్ గరంగరం-తాజావార్తలు

ఫేస్‌బుక్‌పై కాంగ్రెస్ గరంగరం-తాజావార్తలు

* కొద్ది రోజులుగా అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఫేస్‌బుక్‌కు సంబంధించి తీవ్ర మాటల యుద్ధం జరగుతూనే ఉంది. తాజాగా భారత్‌లోని ఫేస్‌బుక్‌ సంస్థ ఉద్యోగులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. దీనిని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ మేం కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యంలో పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష పూరిత ప్రసంగాలతో చేయాలనుకునే ఎలాంటి మార్పులను అంగీకరించబోం. నకిలీ, విద్వేష పూరిత వార్తల ప్రచారంలో ఫేస్‌బుక్ పాత్రపై వాల్‌స్ట్రీట్ జనరల్‌ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలను ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలి’’ అని రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

* ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రముఖ మొబైల్‌ సంస్థ వీవో ఈ ఏడాది తప్పుకోవడంతో ‘డ్రీమ్‌ 11’ అనే కొత్త సంస్థ పదమూడో సీజన్‌ హక్కులను దక్కించుకుంది. 2018 నుంచి 2022 వరకు తొలుత వీవో సంస్థ టైటిల్‌ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.400 కోట్లకు పైగా చెల్లించేది. ఇటీవల భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇక్కడ డ్రాగన్‌ వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది.

* రాష్ట్రంలో ఎక్కడా విద్యాసంస్థల భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.

* ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గోదావరి వరద పరిస్థితిపై కలెక్టర్లను అడిగితెలుసుకున్నారు. అధికారులంతా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామన్నారు.

* జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని వక్ఫ్‌ బోర్డు ఆస్తులకు జియోట్యాగింగ్‌ చేస్తామని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ మహ్మద్‌ సలీమ్‌తో ఆయన సమావేశమయ్యారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలతో అనుసంధానిస్తామన్నారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల నిర్మాణం, లింక్‌ రోడ్ల అభివృద్ధికి వక్ఫ్‌ భూములను సేకరిస్తామన్నారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై తాను ప్రధాని మోదీకి లేఖ రాస్తే.. డీజీపీ స్పందించడం విచిత్రంగా ఉందని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై దాడులు, తప్పుడు కేసులపై గతంలోనూ డీజీపీకి లేఖలు రాశానని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ, ఆత్మకూరు పర్యటనలకు తాను వెళ్లకుండా ఆపడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఆయన ఏడీబీలో బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో తనను ఆగస్టు 31లోగా రిలీవ్‌ చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తన రాజీనామా లేఖను పంపినట్టు తెలుస్తోంది.

* కరోనా వైరస్‌ సహాయక చర్యల కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను.. జాతీయ విపత్తు సహాయ నిధికి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) మళ్లించే విధంగా ఆదేశాలు జారీచేయటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ విధంగా చేయాల్సిందిగా ప్రభుత్వానికి మార్గదర్శకాలను జారీచేయలేమని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవటానికి, సహాయ కార్యక్రమాల నిర్వహణకు పీఎం కేర్స్‌ సహాయ నిధిని కేంద్రం మార్చి 28న నెలకొల్పిన సంగతి తెలిసిందే.

* ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ… ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.

* కరోనా వైరస్‌ సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. ఇన్నాళ్లూ వెంటిలేటర్‌పై చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి మెరుగవడంతో వెంటిలేటర్‌ తీసేసి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రమణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ తెలుగు గాయకులు, సంగీత దర్శకులు సమూహిక ప్రార్థనలు జరపనున్నారు.

* అమెరికాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130డిగ్రీల ఫారెన్‌హీట్‌(54.4డిగ్రీ సెల్సియస్) నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 107ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతేకాకుండా భూమ్మీదనే అత్యధిక ఉష్ణోగ్రతగా దీన్ని భావిస్తున్నారు. తాజాగా డెత్‌ వ్యాలీలో నమోదైన ఉష్ణోగ్రత రికార్డును పరిశీలిస్తున్నామని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)వెల్లడించింది.