DailyDose

అమరావతికి మాకు సంబంధం లేదు-తాజావార్తలు

అమరావతికి మాకు సంబంధం లేదు-తాజావార్తలు

* కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10వేల మంది పారామిలటరీ సిబ్బందిని వెనక్కి రప్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలూ చెలరేగకుండా భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించిన విషయం తెలిసిందే.

* పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం మరోసారి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు నిర్ణయాల అంశంలో దోనె సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రటరీ లలిత అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2014 ఏప్రిల్‌ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసిందని అందులో తెలిపారు. రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్రలేదని.. తమ రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం రూపకల్పన విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా కేంద్రం పునరుద్ఘాటించింది.

* సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌‌ కేసు విచారణపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీచేసింది. ఒకే ఒక్క కుమారుడిని కోల్పోయిన సుశాంత్‌ సింగ్‌ తండ్రి న్యాయాన్ని కోరడాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా పలువురు నేతలు, అధికారులు స్పందించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా నిర్ణీత కాలపరిమితిలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఈ కేసు దర్యాప్తును పూర్తి చేస్తుందనే నమ్మకం ఉందన్నారు.

* ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘వి’. చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న వేళ లాక్‌డౌన్‌ అడ్డుపడింది. థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబందించి ఓ వార్తను రేపు చెప్పబోతున్నామంటూ తాజాగా కథానాయకుడు నాని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో పోస్టు చేశాడు. ‘‘సినిమా థియేటర్‌ ఇంటికి రాకపోయినా.. థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇంటికి రాబోతోంది. ఇల్లే థియేటర్‌గా మారబోతోంది. మళ్లీ షోలు పడబోతున్నాయి. సినిమా విడుదలకు ముందే ఉండే టెన్షన్‌, ఆందోళన నేను చాలా మిస్‌ అయ్యా.. మీరు అలాగే మిస్‌ అయ్యి ఉంటారు. అందుకే ‘వి’ రేపు ఓ వార్త చెప్పబోతుంది’’ అని నాని తెలిపారు. నాని చెప్పినదాన్ని బట్టి చూస్తే అందరు అనుకున్నట్టుగానే ‘వి’ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారం తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.

* ఆర్టీసీ కార్మికులకు రూ.50లక్షల కొవిడ్‌ బీమా ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చింది. కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన 36మందికీ బీమా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు మృతుల వివరాలు సహా ధ్రువపత్రాలు పంపాలని ఆర్‌ఎంలను ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ఈ నెల 28లోపు ధ్రువపత్రాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. కరోనా బీమా వర్తింపజేయడంపై కార్మిక పరిషత్‌ సహా ఇతర సంఘాలు ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలిపాయి.

* కరోనా కట్టడి కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్‌ నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధికి (ఎన్డీఆర్‌ఎఫ్‌) మళ్లించేలా ఆదేశించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ రెండూ వేర్వేరు లక్ష్యాలు కలిగిన వేర్వేరు నిధులని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అంటూనే.. పీఎం కేర్స్‌ నిధి సేకరణకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తారు. వాటిని ట్విటర్‌ మాధ్యమంలో తెలియజేశారు.

* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కాగా.. ఎస్పీబీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన అందరితోపాటు సంగీతప్రియులూ ఆగస్టు 20న సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరుతున్నారు

* కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడానికి అవసరమైన రోగనిరోధకతను పొందే వీలు దరిదాపుల్లో లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. హెర్డ్‌ ఇమ్యూనిటీపై వస్తున్న వార్తలను పూర్తిగా తోసిపుచ్చిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఆ దిశగా అడుగులు వేయకూడదని ప్రపంచదేశాలకు సూచించింది.

* నూతన పారిశ్రామిక విధానానికి ఏపీ మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. బుధవారం సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 2020 నుంచి 2023 వరకు ఈ నూతన పారిశ్రామిక విధానం అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా నూతన విధానం రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

* అమెరికా అధ్యక్షుడైనా.. నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాఖ్యలు చేస్తే వాటిని తొలగిస్తామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. అధ్యక్షుడు, కరోనా వైరస్‌ లేదా ఎన్నికలకు సంబంధించి తమ ప్రమాణాలకు విరుద్ధంగా విద్వేష పూరిత, అసత్య సమాచారాన్ని షేర్‌ చేస్తే దానికి ఫేస్‌బుక్‌లో స్థానముండదని సంస్థ సీఓఓ షెరిల్‌ సాండ్‌బెర్గ్‌ ప్రకటించారు.

* తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన పంటల నష్టం తీవ్రత అర్థం కావడం లేదా? అని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎంకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. నష్టపోయిన రైతులకు రూ.20వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.