Devotional

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD News - Koyil Alwar Tirumanjanam In Tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం చేపట్టనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి కార్యక్రమాలు చేపడుతారు. అనంతరం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. కొవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.