DailyDose

సెక్స్ వర్కర్లకు రేషన్-తాజావార్తలు

Supreme Court Of India Orders Ration Distribution For Sex Workers

* కరోనా పరిస్థితులు, తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కుదించిన సిలబస్‌ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని స్పష్టం చేశారు.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా్డుతూ.. నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని చెప్పారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని స్పష్టం చేశారు.

* డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఉదయం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని.. లక్ష ఇళ్లు కట్టామంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని కూడా మీడియా సమావేశం నిర్వహించి ఆ విమర్శలను తిప్పి కొట్టారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో భట్టి విక్రమార్క మాటలు హాస్యాస్పదమన్నారు. నాంపల్లిలో తాము నిర్మించింది ఒక దగ్గర.. కాంగ్రెస్‌ నేతలు చూసింది మరో దగ్గరని చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నాం.. మీకు జాబితా ఇచ్చాం..చూసుకోండి’’ అంటూ పరోక్షంగా భట్టిని ఉద్దేశించి అన్నారు.

* ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప ఏ మతంపైనా సీఎం జగన్‌కు విశ్వాసం లేదని ఆయన ఆరోపించారు. తెదేపా సీనియర్‌ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, వైకాపా నేతల తీరుపై విమర్శలు చేశారు. సీఎం ఏ మతస్థుడైనా కావొచ్చని.. అన్ని మతాలనూ ఆయన సమదృష్టితో చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత అతనిపై ఉందని చెప్పారు. ఇటీవల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు.

* కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో వ్యాధిపైనా అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే తనకు మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ అనే వ్యాధి గురించి తెలిసిందనీ, యోగా చేయడం, సంగీతం వినడం వంటి వాటితో ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చనీ అన్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు.

* కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. ఐరాసలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యల్లో కశ్మీర్‌ సమస్య ఒకటని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే పాక్‌ వాదనను భారత్‌ ఖండించింది. కుట్రలను పక్కన పెట్టి ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఐక్య రాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ వీడియో సందేశాన్నిస్తూ ప్రపంచంలో శాంతిస్థాపన కోసం ఐరాస చేస్తున్న కృషిని కొనియాడారు. ఐరాస విజయాలను ప్రశంసిస్తూ.. కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయని చెప్పారు.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యానుంచి మరో వ్యాక్సిన్‌ రానుంది. సైబీరియాకు చెందిన వెక్టార్‌ ఇనిస్టిట్యూట్‌ తయారుచేసిన ‘ఏపివచ్ఛొరొన’ వ్యాక్సిన్‌ అక్టోబర్‌ 15నాటికి రిజిస్టర్‌ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు రష్యా మీడియా సంస్థ టీఏఎస్‌ఎస్‌ వెల్లడించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఈ మధ్యే పూర్తయ్యాయి.

* రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు క్షమాపణ కోరితే వారిపై వేటును తొలగించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యసభలో మంగళవారం 8 మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు వాకౌట్‌ చేసిన తర్వాత ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. వైరస్‌ ప్రభావం సెక్స్‌వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే జీవనాధారంగా బతుకుతున్న లక్షల మంది రోడ్డున పడ్డారు. వీరిలో రేషన్‌ కార్డులు కూడా ఉండనివారెందరో. అలాంటి వారందరికీ న్యాయం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్‌ కార్డు లేకపోవడాన్ని మానవ తప్పిదంగా పరిగణించి వారం రోజుల్లోగా వారికి అవసరమైన రేషన్‌ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

* అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు రెండోరోజు పలువురు ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు నేతృత్వంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతారాయ్‌, శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ సురేశ్‌ను అమరావతి మహిళా ఐకాస నాయకులు, రైతులు కలిశారు. అమరావతి సమస్య, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని వాళ్లకు వివరించారు.

* తెలంగాణలో కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా భూమి హక్కులు- పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టంతో పాటు వీఆర్వో పోస్టుల రద్దు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి. ఈమేరకు చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 19న గెజిట్‌ నోటిఫికేషన్లు ప్రచురించారు.

* అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు, హక్కుల్ని ప్రభుత్వం పోలీసుల సాయంతో కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన భాజపా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు.

* ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నియంత్రించాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో గళమెత్తారు. ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా కనకమేడల… రాజధాని అంశాన్ని సభలో ప్రస్తావించారు. వైకాపా నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.