Fashion

మరాఠా మహిళలకు మాస్టర్స్ ఉంటేనే ముద్దు అంట…

Maratha Bride Prefer At Least A Masters Degree For Their Groom

మ‌హారాష్ట్ర‌లో పెండ్లిల్ల నిర్ణ‌యానికి సంబంధించి ఇటీవ‌ల ఓ మ్యాట్రిమొని సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు వెలుగుచూశాయి. మ‌రాఠీల పెండ్లి సంబంధాలను నిశ్చ‌యించే ప్ర‌ముఖ మ్యాట్రిమొని సంస్థ‌ల్లో ఒక‌టైన మ‌రాఠీ మ్యాట్రిమొని ఈ స‌ర్వే నిర్వ‌హించింది. గ‌త 20 ఏండ్లుగా పెండ్లి సంబంధాల కోసం త‌మ‌ను ఆశ్ర‌యించిన వారి డాటా ఆధారంగా మ్యాట్రిమొని సంస్థ స‌ర్వే రిపోర్టును రూపొందించింది.ఇర‌వై ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మ‌రాఠీ మ్యాట్రిమొనిలో ఈ 20 ఏండ్ల కాలంలో రిజిస్ట‌రైన వారి సంఖ్య‌ను ప‌రిశీలిస్తే మ‌హిళ‌లు 30 శాతం, పురుషులు 70 శాతం ఉన్నారు. ఆ డాటాను విశ్లేషించి మ‌రాఠీ మ్యాట్రిమొని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. జీవిత‌భాగ‌స్వామికి ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాల‌నే వివ‌రాల‌తో రూపొందించే ప్రోఫైల్‌ను 76 శాతం యువ‌త త‌మ సొంతంగానే క్రియేట్ చేస్తున్నార‌ని స‌ర్వే సంస్థ పేర్కొన్న‌ది. కేవ‌లం 7 శాతం మందికి మాత్ర‌మే త‌ల్లిదండ్రులు ప్రోఫైల్ క్రియేట్ చేస్తున్నార‌ని మ‌రాఠీ మ్యాట్రిమొని తెలిపింది. ఇక మిగ‌తా వారికి తోబుట్టువులో, ఇత‌రులో ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నార‌ని పేర్కొన్న‌ది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రోజురోజుకు కులం ప‌ట్టింపులు త‌గ్గిపోతున్నాయ‌ని స‌ర్వే రిపోర్టు స్ప‌ష్టం చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం 55 శాతం మంది మ‌హిళ‌లు, 61 శాతం మంది పురుషులు జీవితభాగ‌స్వామి ఇత‌ర కులానికి చెందిన వారైనా ప‌ర్వాలేద‌ని పేర్కొన్నార‌ని తెలిపింది. ఇక విదేశాల్లో ఉండే జీవిత భాగస్వామిని కోరుకునే వారిలో ఎక్కువ‌గా అమెరికా, జ‌ర్మ‌నీ, కెన‌డా, ఫ్రాన్స్ దేశాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని మ‌రాఠీ మ్యాట్రిమొని పేర్కొన్న‌ది. మ‌రోవైపు 26 శాతం మంది మ‌హిళ‌లు త‌మ‌కు కాబోయేవాడు మాస్ట‌ర్ డిగ్రీ లేదా అంత‌కు మించి చ‌దువుకుని ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని, పురుషుల్లో మాత్రం కేవ‌లం 7 శాతం మంది మాత్ర‌మే జీవిత‌భాగ‌స్వాముల నుంచి అలాంటి విద్యార్హ‌త‌ల‌ను ఆశిస్తున్నార‌ని స‌ర్వే సంస్థ వివ‌రించింది. ఇక‌, జీవిత‌భాగ‌స్వామి కోసం మ‌రాఠీ మ్యాట్రిమొనిని సంప్ర‌దించే వారి సంఖ్య‌ప‌రంగా చూస్తే.. మ‌హారాష్ట్ర‌లో పుణె, ముంబై, నాసిక్‌, నాగ్‌పూర్‌, అహ్మ‌ద్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయ‌ని, మ‌హారాష్ట్ర వెలుప‌ల మాత్రం బెంగ‌ళూరు, బెల్గాం, హైద‌రాబాద్‌, సూర‌త్‌, వ‌డోద‌ర ప‌ట్ట‌ణాలు అగ్ర స్థానంలో ఉన్నాయ‌ని ఆ మ్యాట్రిమొని సంస్థ పేర్కొన్న‌ది.