DailyDose

భారతీయులకు నెట్‌ఫ్లిక్స్ ఉచితం-తాజావార్తలు

భారతీయులకు నెట్‌ఫ్లిక్స్ ఉచితం-తాజావార్తలు

* పోలీస్‌ అమవీరుల దినోత్సవ సందర్భంగా న‌గ‌రంలోని ఎల్‌బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమాజ భద్రత, ఉజ్వల భవిష్యత్‌ కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, చేస్తున్నారన్నారు. త్యాగధనులకు సమాజం రుణపడి ఉందన్నారు.

* భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు.

* మంచిర్యాల జిల్లాలోని ఇందారం ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ను బుధవారం సింగరేణి డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌) బలరాం ప్రారంభించారు. శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఈ ఓసీపీ వద్ద కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

* పెద్దపల్లిలోని గోదావరి నది తీరంలో నూతనంగా ఎర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి పరిశీలించారు.

* హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల‌కు అనేక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, హెచ్‌టీఎల్‌టీ లైన్లు దెబ్బతిని సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో బుధవారం టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్ కో చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

* త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. భరత్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల న్యాయవాదులతో వారు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

* నీట్ ప‌రీక్షలో సౌత్ ఇండియాలో మొద‌టి ర్యాంక్, ఆల్ ఇండియాలో మూడో ర్యాంక్‌ సాధించిన వ‌రంగ‌ల్‌ జిల్లాకు చెందిన స్నికితారెడ్డిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో స్నికితారెడ్డి, ఆమె తల్లిదండ్రులు డాక్టర్ స‌దానంద‌రెడ్డి, త‌ల్లి డాక్టర్ ల‌క్ష్మి కేటీఆర్‌ను కలిశారు.

* నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఏరియా ఆస్ప‌త్రిలో నూతనంగా కొవిడ్‌ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

* భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏఎస్పీ రాజేష్‌ చంద్ర వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

* గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ చివరకు తాను క్యాన్సను జయించినట్లు ప్రకటించాడు. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడే ఈ ప్రకటన వెలువడటం ఎంతో సంతోషంగా ఉందని ఒక పొడవాటి పోస్ట్‌తో ట్విట్టర్‌లో ఈ వార్తను పంచుకున్నాడు.

* నెట్‌ఫ్లిక్స్‌ భారత వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 48 గంటలపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలను అందించనున్నారట. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా ‘స్ట్రీమ్‌ ఫెస్ట్‌’ అనే కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని తొలుత మన దేశంలోనే తీసుకొస్తారట. అందులో భాగంగా డిసెంబరు 4 నుంచి 48 గంటల ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ తీసుకొస్తున్నారు.

* కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పూ ఉండదని, ముఖ్యమంత్రి యడియూరప్ప నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర భాజపా స్పష్టంచేసింది. యడియూరప్ప ఎంతోకాలం సీఎంగా కొనసాగరంటూ భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలతో పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ స్పందించారు. రాష్ట్రంలో సీఎంని మార్చే ప్రసక్తేలేదన్నారు. మూడేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా యడియూరప్ప నాయకత్వంలోనే ఎదుర్కొంటామని ట్విటర్‌లో పేర్కొంటూ ఊహాగానాలకు తెరదించారు. పూర్తికాలం పాటు సీఎంగా యడియూరప్పే కొనసాగుతారని స్పష్టంచేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* ప్రభుత్వ అనుమతి పొందే అవసరం లేకుండానే విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా సంస్థల ముసుగులో పొరుగున ఉన్న డ్రాగన్ మన దేశంలో కార్యకలాపాలను సాగించడాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా త్వరలోనే ఓ నిబంధన అమలులోకి రానున్నట్టు తెలిసింది. భారతీయ విశ్వవిద్యాలయాలు దేశ సరిహద్దుల్లో ఉన్న ఏ దేశానికి చెందిన విద్యాసంస్థతో అయినా అవగాహనా ఒప్పందానికి (ఎంఓయూ) వచ్చే ముందు.. విద్యా శాఖ అనుమతి పొందటం ఇకపై తప్పనిసరి కానుంది. ఈ అంశంపై తాము విద్యాశాఖతో విస్తృత చర్చలు జరిపామని.. ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విదేశీ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి.

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్‌ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్‌ విలువ రూ.3,737 కోట్లు అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. ఉత్పాదక, ఉత్పాదకేతర బోనస్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదైనా అవసరం ఉంటే ఎస్‌ఈసీ తమను సంప్రదించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సూచించగా.. తాము గమనిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరితో ఎస్‌ఈసీ హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం బాధాకరమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న ఇబ్బందులపై సవివరమైన అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎస్‌ఈసీ తరఫున సీతారామమూర్తి, అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు. మరోవైపు ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూ.39లక్షల నిధులు విడుదల చేయడం గమనార్హం.