NRI-NRT

“స్వింగ్” జరా జరా

“స్వింగ్” జరా జరా

భారత్‌ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ ఓట్లు ఎవరికి వేస్తే వారిదే విజయం! కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలా కాదు!! ప్రజల ఓట్లు ఎన్నొచ్చాయన్నది కాదు లెక్క.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎన్నొచ్చాయన్నదే లెక్క. అందుకే.. 2016 ఎన్నికల్లో ట్రంపు కన్నా హిల్లరీకి 28.68 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువగా దక్కించుకున్నట్రంపే శ్వేతసౌధాధిపతి అయ్యారు. సంక్లిష్టంగా ఉంటూ సుదీర్ఘంగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విచిత్రమిది. ‘విన్నర్‌ టేక్స్‌ ఆల్‌’ అనే సూత్రం ప్రత్యేకత ఇది. అన్ని రాష్ట్రాల మద్దతు ఉన్న అభ్యర్థే అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని వారు ఎంచుకున్నారు. సాధారణంగా అమెరికాలో కొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్లకు, కొన్ని రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్నాయి. ఎటూ మొగ్గని రాష్ట్రాలను స్వింగ్‌ స్టేట్స్‌ అంటారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేవి ఆ రాష్ట్రాలే. అవి.. ఫ్లోరిడా (29), పెన్సిల్వేనియా (20), ఒహాయో (18), మిచిగన్‌ (16), నార్త్‌ కరోలినా (15), అరిజోనా (11), విస్కాన్సిన్‌ (10). వీటిలో మొత్తం 119 ఎలక్టొరల్‌ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నువ్వానేనా అన్నట్లు ఉండడంతో ఓట్ల లెక్కింపు కూడా బాగా ఆలస్యమవుతుంటుంది. 2016 ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడు రాష్ట్రాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేశారు.
*ఫ్లోరిడా ప్రత్యేకం..
స్వింగ్‌ రాష్ట్రాల్లో ఫ్లోరిడాను రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా చూస్తుంటారు. ఎందుకంటే 1964 నుంచి ఈ రాష్ట్రాన్ని గెలుచుకున్న అభ్యర్థే అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. డెమోక్రటిక్‌ అభ్యర్థిగా బరాక్‌ ఒబామా 2008, 2012లో ఇక్కడ విజయం సాధించారు. 2016లో ఫ్లోరిడావాసులు ట్రంప్‌ వైపు మొగ్గారు. అయితే ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో జనం నాడి ముందుగానే తెలుసుకోవడం అంత తేలిక కాదని విశ్లేషకులు అంటున్నారు. కాలిఫోర్నియా (55) తర్వాత అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లున్న టెక్సాస్‌(38) ప్రజలు.. 1980 నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థినే ఎన్నుకుంటున్నారు. ఈ దఫా ఇక్కడ ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని.. ఈ రాష్ట్రంతో పాటు రిపబ్లికన్‌ రాష్ట్రమైన జార్జియా (18 ఎలక్టరల్‌ ఓట్లు)ను కూడా తాము గెలుచుకుంటామని డెమోక్రాట్లు ఆశాభావంతో ఉన్నారు. ఇదే జరిగితే బైడెన్‌ విజయపథంలో పయనించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*సర్వేలు అలా.. ఫలితాలు ఇలా..
2016 ఎన్నికలప్పుడు జరిగిన అన్ని సర్వేల్లోనూ ట్రంప్‌ కన్నా హిల్లరీనే ముందంజలో ఉన్నారు. ఎన్నికల్లో సైతం హిల్లరీకి 6,58,53,514 ఓట్లు (48.2ు) రాగా.. ట్రంప్‌కు 6,29,84,828 ఓట్లు (46.1ు) వచ్చాయి. కానీ, ‘స్వింగ్‌’ రాష్ట్రాల్లో 119 ఎలక్టోరల్‌ ఓట్లు మొత్తం ఆయనకే లభించాయి. దీంతో.. హిల్లరీ కన్నా 2.1 శాతం తక్కువ ఓట్లు వచ్చినా ఆయన 304 ఎలక్టొరల్‌ ఓట్లు సాధించి అధ్యక్షుడయ్యారు. 227 ఎలక్టోరల్‌ ఓట్లు మాత్రమే పొందిన హిల్లరీ పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ట్రంప్‌, బైడెన్‌ ఈ ఏడు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రచారానికి తాము సేకరించిన విరాళాల్లో అత్యధికం ఇక్కడే ఖర్చుపెడుతున్నారు. ప్రతి రెండ్రోజులకూ ఈ ఏడు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట పర్యటిస్తూ వస్తున్నారు. వీటన్నింటిలోనూ ప్రస్తుతానికి బైడెన్‌దే పై చేయిగా ఉందని పలు సర్వేల్లో తేలింది. కానీ.. ప్రజాదరణలో ఇద్దరికీ తేడా మాత్రం చాలా తక్కువ శాతమే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. స్వింగ్‌ రాష్ట్రాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. మరి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే!!
*మొదటి దశ..
అభ్యర్థిని ఎంచుకునే ఎన్నికలు
అభ్యర్థులను ప్రకటించడానికి పార్టీలు నిర్వహించే ఎన్నికలతో తొలి దశ మొదలవుతుంది. వాటిని.. ప్రైమరీ, కాకస్‌ అంటారు. అభ్యర్థులు ఈ దశలో తమ తమ పార్టీల సభ్యుల విశ్వాసాన్ని, మద్దతును కూడగట్టుకునేందుకు దేశమంతా తిరిగి ప్రచారం చేసుకుంటారు.
*కాకస్‌:
పార్టీ సభ్యులు బృందాలుగా విడిపోయి చర్చలు, ఓట్ల ద్వారా అభ్యర్థిని ఎంచుకుంటారు.
*ప్రైమరీ:
పార్టీ సభ్యులంతా వరుసలో నిలబడి నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు.
*రెండో దశ..
ప్రతి పార్టీ జాతీయ సదస్సు నిర్వహించి తమ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడబోయే అభ్యర్థి ఎవరో ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ప్రెసిడెన్షియల్‌ అభ్యర్థులు దేశమంతా తిరుగుతూ ప్రజల మద్దతు పొందేందుకు ప్రచారం చేస్తారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మూడు డిబేట్లు జరుగుతాయి. వీటి ఆధారంగా చాలా మంది తటస్థులు తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకుంటారు.
*మూడో దశ: ఓటింగ్‌
అమెరికాలోని 50 రాష్ట్రాల ప్రజలూ నవంబరు నెలలో వచ్చే తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం (తొలి మంగళవారం కాదు) తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, వారు ఓటు వేసేది నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు కాదు. పార్టీ ప్రతినిధికి ఓటేస్తారు. ఈ ప్రతినిధిని ఎలక్టర్‌ అంటారు. అమెరికా పార్లమెంటులో దేశంలోని 50 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికీ నిర్ణీత సంఖ్యలో ఎలక్టర్స్‌ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే.. మెయిన్‌, నెబ్రాస్కా రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో విషయంలో గెలిచిన పార్టీకే మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లు దక్కుతాయి (విన్నర్‌ టేక్స్‌ ఆల్‌).
*అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక
సాధారణంగా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీరు ఆధారంగా గెలుపెవరిదో 24 గంటల్లోపే రాజకీయ విశ్లేషకులు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ.. అధికారికంగా కొంత ప్రక్రియ మిగిలే ఉంటుంది. అది నవంబరు రెండోవారం నుంచి డిసెంబరు రెండోవారం దాకా జరుగుతుంది.
*మెజారిటీ రాకపోతే?
ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్ధులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే? దానికి కూడా అమెరికా రాజ్యాంగంలో స్పష్టమైన విధానం ఏర్పాటు చేసుకున్నారు. ఏ అభ్యరికీ సంపూర్ణ మద్దతు రాకపోతే అమెరికా పార్లమెంటులోని దిగువ సభ అధ్యక్షుడిని, ఎగువ సభ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.