Food

చలికాలం బెల్లం తింటే…?

Jaggery & Winter - Telugu food and diet news

బెల్లం (జాగరీ) ఒక తియ్యని ఆహార పదార్థం. దీనిని సాధారణంగా చెరకు రసం నుంచి తయారుచేస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలలో వినియోగిస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుంచి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుంచి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకం, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టిదనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు.
*మన ఆహార సంస్కృతిలో బెల్లం అంతర్భాగం. పురాతన కాలం నుంచి బెల్లం వాడుకలో ఉంది. ఆయుర్ఫార్మ్‌ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద, అలైడ్ సైన్సెస్‌లో 2016 లో ప్రచురించిన ఒక ఒక అధ్యయనం ప్రకారం.. బెల్లాన్ని ఆయుర్వేద చికిత్సా.. ఔషధాల తయారీకోసం వాడుతారు. తెల్ల చక్కెరతో పోల్చినప్పుడు బెల్లం సహజమైన, ఆరోగ్యకరమైన స్వీటెనర్. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. జింక్, రాగి, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ కూడా ఉంటుంది. బెల్లంలో బీ విటమిన్లు, కొన్ని రకాల మొక్క ప్రోటీన్లు, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బెల్లం తినడం, ముఖ్యంగా శీతాకాలంలో ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రధానంగా ఈ కింది ఐదురకాల ప్రయోజనాలున్నాయి.
1. శరీరమంతా శుభ్రపరుస్తుంది..
ఫుడ్ కెమిస్ట్రీలో 2009 లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు దీనికి సైటోప్రొటెక్టివ్ గుణాన్ని ఇస్తాయి. అంటే ఊపిరితిత్తులనుంచి శ్లేష్మాన్ని తొలగించడమేకాకుండా శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. రోజులో ఒక్కసారైనా బెల్లం తినడం వల్ల శరీరమంతా డిటాక్స్‌ అవుతుంది.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..
బెల్లంను సాధారణంగా భోజనం తర్వాత తప్పకుండా తినాలి. ఇది పేగులను ప్రేరేపిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల విడుదలకు సహాయపడుతుంది. మలబద్దకం, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారికి బెల్లం గొప్పగా సహాయపడుతుంది.
3. రక్తహీనతను నివారిస్తుంది..
బెల్లంలో ఐరన్‌, భాస్వరంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణకు తోడ్పడుతుంది.
4. ఇమ్యూనిటీ పవర్‌ పెంచుతుంది..
బెల్లంలో అనే పోషకాలున్నాయి. అలాగే, శరీరాన్ని డిటాక్స్‌ చేస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీపవర్‌ పెరుగుతుంది. చలికాలంలో వచ్చే ఫ్లూ, ఇతర వ్యాధులకు బెల్లం చక్కని పరిష్కార మార్గం.
5.గ్లూకోజ్ నియంత్రణ, బరువు తగ్గుదల..
తెల్ల చక్కెరకు బెల్లం ఒక గొప్ప ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. బరువు తగ్గేలా చూస్తుంది. అలాగే, చక్కెరకంటే కూడా చాలాసేపు తీపి తిన్న అనుభవాన్ని కలిగిస్తుంది. చక్కెర బదులు బెల్లాన్ని తీసుకుంటే ఇతర కొవ్వుపదార్థాలు తీసుకోవాలన్న కోరిక కూడా తగ్గుతుంది.