Business

వరుసగా మూడో రోజు పెరిగిన చమురు ధరలు-వాణిజ్యం

Business News - Fuel Prices Hiked For Third Day Straight

* పెట్రోల్, డీజిల్​ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.దిల్లీలో డీజిల్​పై లీటరుకు 19 పైసలు, పెట్రోల్​పై 8 పైసలు చొప్పున ధర పెరిగింది.తాజాగా పెరిగిన ధరలతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.81.46కు, డీజిల్​ ధర రూ.71.07కు చేరింది.శుక్రవారం నుంచి పెట్రో ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.ఈ మూడురోజుల్లో పెట్రోల్​పై ధర 40 పైసలు పెరగగా.. డీజిల్​పై 61 పైసలు పెరిగింది.అంతర్జాతీయ ధరలకు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు వివిధ చమురు సంస్థలు తెలిపాయి.ఆయా రాష్ట్రాల్లోని స్థానిక అమ్మకాల పన్నుల ప్రకారం ఈ ధరల్లో తేడా ఉండనుంది.

* విదేశీ సంస్థాగత మదుపుదార్ల(ఎఫ్‌ఐఐలు)కు భారత్‌ గమ్యస్థానంలా మారింది. బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూనే ఉన్నారు. ఓ వైపు పాశ్చాత్య దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉంటే.. భారత్‌లో మాత్రం కరోనా కేసుల వృద్ధి తగ్గుముఖం పడుతున్న వేళ ఇది సానుకూలాంశమే. నవంబరు నెలలో ప్రతీ రోజూ ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లు చేస్తూనే వచ్చారు. ఇప్పటిదాకా భారత ఈక్విటీ మార్కెట్లో వీరు రూ.45,732 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. గత రెండు దశాబ్దాలలోనే ఇది రికార్డు నెలవారీ కొనుగోళ్లు కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఎఫ్‌ఐఐలు రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు మన మార్కెట్లోకి తీసుకువచ్చారు.

* భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచలోనే అత్యధిక ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా అవతరించింది. ఆర్‌బీఐ అధికారిక ట్విటర్‌ ఖాతా ‘‘ఋభీ ట్విత్తెర్’’ తాజాగా 10 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరెన్నికగన్న యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 6.67 లక్షల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలవగా.. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఈసీబీ) 5.91లక్షల మందితో మూడో స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సహోద్యోగులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. గత సెప్టెంబరు 27 నాటికి 9.66 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆర్‌బీఐ ట్విటర్‌ హ్యాండిల్‌ తాజాగా 10లక్షల మైలురాయిని దాటింది.

* ‘వినియోగదారులు ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు కొనుగోలు చేసే తీరును కొవిడ్‌ గణనీయంగా మార్చింది. గతంలో పని నడిచిపోతే చాలు అన్నట్లు, కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ, అధిక ధర అయినా వెచ్చించి, హైఎండ్‌ ఫీచర్లు ఉన్నవి ఎక్కువ మంది కొంటున్నారు. కొవిడ్‌ వల్ల అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, బయటికి వెళ్లడం బాగా పరిమితం కావడంతో పొదుపు పెరగడమే ఇందుకు కారణం. డిష్‌వాషర్లు అయితే గతంలో ఎన్నడూ లేనంతగా అమ్ముడు పోతున్నాయి’ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా కన్జూమర్‌ అప్లయన్సెస్‌ అధిపతి విజయ్‌ బాబు చెప్పారు. గత పదేళ్లలోనే అధికంగా ఈ పండుగ సీజన్‌ అమ్మకాలు సాగాయని ఇంటర్వ్యూలో చెప్పారు.

* చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామికవాడకు నాణ్యతా పర్యావరణహిత వ్యవస్థ నిర్వహణకు గాను ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసినట్లు శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యతా నిర్వహణకు 9001:2015, పర్యావరణహిత వ్యవస్థల నిర్వహణకు గాను 14001:2015 ప్రమాణ ధ్రువీకరణ పత్రాలను శ్రీసిటీ ప్రతినిధులకు అందజేశారన్నారు. శ్రీసిటీ ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, అంకిత భావంతో మేమందించే నాణ్యమైన సేవలకు పర్యావరణహిత కార్యక్రమాల అమల్లో మా నిబద్ధతకు దక్కిన గొప్ప గౌరవంగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.