Fashion

షేర్వానీలతో హైదరాబాద్ బంధం

షేర్వానీలతో హైదరాబాద్ బంధం

ఆహార విషయాల్లోనే కాదు ఆహార్య వ్యవహారాల్లోనూ హైదరాబాద్‌ శైలి ప్రత్యేకం. ముత్యాల నగరంగా పేరు మోసిన భాగ్యనగరి.. ఫ్యాషన్‌ ప్రపంచానికి ఎన్నో కొత్త అందాలను పరిచయం చేసింది. రంగురంగుల గాజులు, చారడంత సైజుండే జుంకాలు, రాచరికాన్ని రంగరించుకున్న అద్దాల చీరలు.. ఇవన్నీ హైదరాబాదీ స్టయిల్స్‌గా పేరుమోసినవే. అబ్బాయిల విషయానికి వస్తే షేర్వానీ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌లో ఎప్పటికీ రారాజుగా నిలుస్తుంది. షాయరీలకు అందని దర్పాన్ని ప్రదర్శిస్తుంది షేర్వానీ. రొమ్ము విరుచుకు నిలబడినా, మర్యాదగా ఒంగి సలాము చేసినా.. మడత నలగకుండా, ముడత పడకుండా వేసుకున్న వారి గౌరవాన్ని నిలబెడుతుందిది. పూసలు, ముత్యాలు, పట్టు సొగసులు కలగలిపి షేర్వాణీలను మరింత ఆకర్షణీయంగా తయారు చేయించుకునేవారు పాత తరం వాళ్లు. షేర్వానీకి తగ్గట్టుగా ఆభరణాలు ధరించేవారు. అత్తరు గుబాళింపులతో అడుగులో అడుగేస్తూ షేర్వానీ సొగసును తేరిపారా చూసుకునేవారు. ఒకప్పుడు నవాబులకే పరిమితమైన ఈ వస్త్రశ్రేణి కాలక్రమంలో హైదరాబాదీ స్టయిల్‌గా మారిపోయింది. ఆధునిక ఫ్యాషన్‌ సూత్రాలను మిళితం చేసి మరింత అందంగా ధరిస్తున్నారు. పెండ్లయినా, పండుగైనా, బోనాల సంబురమైనా.. సెలబ్రిటీల నుంచి గల్లీ పోరగాండ్ల వరకు షేర్వానీ వేసుకోవాల్సిందే! పెండ్లి వేడుకల కోసం పట్టుతో తయారైనవి, సాధారణ వేడుకలకు డిఫరెంట్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందిన షేర్వానీలు అందుబాటులో ఉంటున్నాయి. ట్రంకు పెట్టెలో భద్రపరిచిన షేర్వానీలను గర్వంగా చూపిస్తూ, దాని వెనుకున్న కథాకమామీషు చెప్పే ఆ తరం పెద్దమనుషులు అక్కడక్కడా ఇప్పటికీ తారసపడుతూనే ఉంటారు.