Business

లీటర్ పెట్రోల్ ₹82.66-వాణిజ్యం

లీటర్ పెట్రోల్ ₹82.66-వాణిజ్యం

* ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్‌ అధినేత, పద్మభూషణ్‌ గ్రహీత మహాశయ్‌ ధర్మపాల్‌ గులాటీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో దిల్లీలోని ఆసుపత్రిలో చేరిన ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 97 సంవత్సరాలు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 పాయింట్ల లాభంతో 44,632 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎసీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 13, 133 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు తగ్గి 73.91గా కొనసాగుతోంది. మారుతి సుజుకీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్‌, హిందాల్కో తదితర కంపెనీల షేర్లు లాభపడగా… ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ,టీసీఎస్‌, బజాజ్‌ ఆటో తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి.

* ప్రముఖ ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. బ్యాంకుకు చెందిన డాటా సెంటర్‌లో గత నెల చోటుచేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఆదేశాలతో బ్యాంకు నూతన క్రెడిట్‌ కార్డుల జారీకి కూడా బ్రేక్‌ పడింది.

* రెండు రోజుల విరామం అనంతరం చమురు సంస్థలు మరోసారి ధరలు పెంచాయి. గురువారం పెట్రోలుపై 17, డీజిల్‌పై 19 పైసలు పెరిగాయి. దాంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 82.66గా ఉండగా, డీజిల్ ధర 72.84కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు పీపా ధర 48.12 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు ధరలు పెంచడంతో నవంబర్ 20న పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పులు కనిపించాయి. అంతకు, ముందు 48 రోజులు ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కాగా, వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల ధరల్లో తేడాలు కనిపిస్తుంటాయి.