Business

తెలంగాణాలో ఫియట్ కార్ల పరిశ్రమ-వాణిజ్యం

తెలంగాణాలో ఫియట్ కార్ల పరిశ్రమ-వాణిజ్యం

* ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫియట్‌ తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్(ఎఫ్‌సీఏ)‌, తెలంగాణ ప్రభుత్వం బుధవారం సంయుక్తంగా నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. హైదరాబాద్‌లో దాదాపు 150 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.1,103 కోట్లు)తో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఉత్తర అమెరికా వెలుపల సంస్థ నెలకొల్పనున్న భారీ డిజిటల్‌ హబ్‌ ఇదే కావడం విశేషం. వచ్చే ఏడాది ఆఖరు నాటికి దాదాపు 1000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఎఫ్‌సీఏ నార్త్‌ అమెరికా, ఆసియా-పసిఫిక్‌ సీఐవో మమతా చామర్తి తెలిపారు.

* కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ ఆంక్షలు వ్యాపారాలపైనే కాదు.. కంపెనీల కార్యకలాపాలపైనా తీవ్రమైన ప్రభావం చూపాయి. దీంతో కొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించగా, ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను కొంతమేర తొలగించాయి. ఈ పరిణామాలు ప్రజల పొదుపు ధోరణిపై ప్రభావం చూపాయి. అనివార్యంగా చాలా మంది పొదుపు తగ్గించుకున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. ‘ఉద్యోగాలు, వేతనాల కోతతో ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. కరోనా పరిణామం చోటుచేసుకొని ఇంచుమించు తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇంకా వారి ఆదాయస్థితి మెరుగవ్వలేద’ని సర్వే పేర్కొంది.

* ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌లో వాటాలను కొనుగోలు చేసేందుకు అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంత గ్రూపు ఏర్పాట్లు చేసుకొంటోంది. ఇప్పటికే వాటాల కొనుగోలు ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ డీల్‌ కోసం డెట్‌ అండ్‌ ఈక్విటీ విధానంలో 8 బిలియన్‌ డాలర్లను సమీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బ్యాంకులతో చర్చలను ప్రారంభించింది. జేపీ మోర్గాన్‌తో చర్చలు తదుపరి దశకు చేరుకొన్నట్లు సమాచారం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. కొవిడ్‌-19కు టీకా అందుబాటులోకి రావడం, విదేశీ పెట్టుబడుల వెల్లువతో బుధవారం సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం 13,663.10 పాయింట్ల వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 114.85 (0.85%) లాభపడి 13,682.70 వద్ద ముగిసింది. 13,606.45 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయికి వెళ్లిన సూచీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో 13,692.35 వద్ద ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయిని అందుకుంది.

* లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రక్రియను ప్రభుత్వం మళ్లీ చేపడుతోంది. జనవరిలో పెట్టుబడిదార్లతో ప్రభుత్వం సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని (రూ.2.1 లక్షల కోట్లు) చేరేందుకు ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ దోహదపడనుంది. కొవిడ్‌-19 సంక్షోభం పరిణామాల కారణంగా ఎల్‌ఐసీ ఇష్యూ ప్రక్రియ జాప్యమవుతూ వస్తోంది. వచ్చే త్రైమాసికంలో పెట్టుబడిదార్ల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారి వెల్లడించారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీలో మైనారిటీ వాటా విక్రయ ప్రక్రియ కోసం యాక్చురియల్‌ సంస్థను వచ్చే 7-10 రోజుల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం నియమించనుంది.

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ తీవ్రమైన ప్రభావం చూపింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోనే దాదాపు 8 కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయని అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌ పేర్కొంది. ‘‘కొవిడ్‌-19 ఈ ప్రాంతంలోని ఉద్యోగ మార్కెట్‌పై సమ్మెటపోటు వేసింది. చాలా దేశాలకు తక్కువ సామాజిక భద్రత, వ్యవస్థాపరమైన శక్తిసామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. దీంతో వ్యాపార సంస్థలకు చేయూతనిచ్చేందుకు, వర్కర్లు నిలదొక్కుకొనేందుకు సాయం చేయడం సాధ్యం కాలేదు’’ అని ది ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ఆసియా పసిఫిక్‌ విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ చిహోకో అసడ మియాకవ పేర్కొన్నారు.