Food

రొట్టెలు….పోషకాల పుట్టలు

The story and nutrition of rotis - Telugu diet news

తాతల నాడు వరన్నం తినడమే వరం అనుకునే రోజుల్లో జొన్న గట్క ప్రధాన ఆహారంగా ఉండేది. ఇప్పుడు ఇంటింటా వరి వెల్లివిరుస్తున్నా.. జొన్న చిన్నబుచ్చుకుంది లేదు. ఎందుకంటే పోషకాల్లో మిన్నగా చెప్పుకొనే జొన్న ఎప్పటికీ రారాజే! వయసుడిగిన వాళ్లు, ఒంట్లో సుస్తీ చేసిన వాళ్లు సత్తువ కోసం జొన్న రొట్టెలు తినడం మామూలే. కానీ, మారుతున్న జీవనశైలి జొన్నను మిన్నగా నిలుపుతున్నది. లొట్టలేసుకొని తినకున్నా.. హెల్దీడైట్‌లో భాగంగా జొన్నరొట్టెలకు జైకొడుతున్నారు. జొన్నరొట్టెలు చేయడమే జీవనోపాధిగా వందల కుటుంబాలు బతుకులు వెళ్లదీస్తున్నాయి. మరి జొన్నల్లోని పోషకాల సంగతేంటో ఒకసారి తెలుసుకుందాం.బలవర్ధకమైన ఆహారంలో జొన్నలది ప్రత్యేక స్థానం. ఇందులో ప్రొటీన్లే కాకుండా ఫాస్పరస్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నేరేడుపండ్లలో కన్నా జొన్నల్లో రెట్టింపు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ వంటి బీకాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువ. జొన్నల్లోని ఫీనాలిక్‌ యాసిడ్స్‌, ట్యానిన్స్‌, యాంథోసయనిన్‌ వంటి పోషకాలు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. జొన్న సంకటి, జొన్న అంబలి, జొన్న రొట్టెలను ఆహారంలో తీసుకుంటే.. గుండెజబ్బులు, క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు. మెరుగైన జీర్ణక్రియకి తోడ్పడే ఫైబర్‌ జొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. జొన్నలు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి వీటికి ఉంది. రొట్టెలు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నరాల బలహీనతను తగ్గిస్తాయి. వయసుతో వచ్చే మతిమరుపు, కంటిచూపు వంటి సమస్యలనూ నియంత్రిస్తాయి. జొన్నల్లో పచ్చవి, తెల్లవి రెండు రకాలు మన ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎర్ర జొన్నలు కూడా వాడుకలో ఉన్నాయి. ఏ రకం జొన్నలైనా పోషకాల విషయంలో వేటికవే సాటి. వేటికి ఓటు వేసినా ఆరోగ్యసిద్ధి తప్పక కలుగుతుంది. జొన్నల్లోని ఐరన్‌ రక్తహీనతను నివారిస్తుంది. ఇందులోని క్యాల్షియం, విటమిన్‌-బి శరీరానికి అవసరమైన ఫోలిక్‌ ఆమ్లాన్ని అందిస్తాయి. బియ్యం, గోధుమల్లో కన్నా జొన్నల్లోనే క్యాల్షియం మోతాదు ఎక్కువ. ఎముకలు బలిష్టంగా ఉండేందుకు అవసరమైన ఫాస్పరస్‌ను వీటిద్వారా పొందవచ్చు. జొన్నలను రొట్టెల రూపంగానే కాకుండా జొన్న పేలాల లడ్డూలు, అప్పడాలు, అంబలి తదితర రూపాల్లోనూ తీసుకోవచ్చు. జొన్నలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒబేసిటీతో బాధపడేవారూ డైట్‌లో జొన్న ఆహారాన్ని చేర్చుకుంటే బరువు తగ్గొచ్చు. స్థూలకాయం వల్ల కలిగే అనర్థాలకు కళ్లెం వేయొచ్చు. గుండె ఆరోగ్యానికీ జొన్న ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని నియాసిన్‌ అనే బి-6 విటమిన్‌ కాంపౌండ్‌.. తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయి శక్తిలా మార్చేందుకు దోహదం చేస్తుంది. దానివల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. తద్వారా బరువు తగ్గుతుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో సమస్యలను నివారిస్తాయి. మలబద్ధకాన్ని నియంత్రిస్తాయి.