Food

సపోటా చలికాలం ఇబ్బందులకు టాటా

సపోటా చలికాలం ఇబ్బందులకు టాటా

చలికాలం తినాల్సిన పళ్ల జాబితాలో సపోటా ఒకటి. ఈ పండును కేవలం రుచికోసమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా తినాల్సిందే. దీనిలోని విటమిన్‌ సి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. హానికారక బ్యాక్టీరియాను చంపేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
*జీర్ణక్రియ మెరుగ్గా
సపోటాలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెద్దపేగుకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది.
*ఇన్‌ఫ్లమేటరీ ఏజంట్‌
దీనిలో ఎక్కువ మోతాదులో ఉండే టానిన్స్‌ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ వాహకాలుగా పనిచేస్తాయి. అంతేకాదు జీర్ణాశయ సంబంధ పలు వ్యాధులను నివారిస్తాయి కూడా. వాపు, నొప్పిని తగ్గిస్తాయి.
*జలుబు, దగ్గు
సపోటలోని పోషకాలు తీవ్రమైన దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి. ముక్కులో, శ్వాసనాళంలో పేరుకుపోయిన స్ఫుటం, దుమ్మూ, ధూళిని బయటకు పంపిస్తాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుండవు. చలికాలంలో తరచూ వేధించే జలుబు కూడా పోతుంది.
*దృఢమైన ఎముకలు
సపోటలోని మినరల్స్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ వంటివి ఎముకలను పటిష్ఠం చేస్తాయి. దీనిలోని కాపర్‌ ఎముకల కణజాల ఉత్పత్తిని పెంచి, ఆస్టియోపోరోసిస్‌, కండరాల బలహీనత, ఎముకలు విరిగిపోవడం, కీళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారు సపోటాలను తింటే ఉపశమనం లభిస్తుంది.
*యాంటీ ఆక్సిడెంట్‌
సపోటాలో ఎ, ఇ, సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు తేమను అందిస్తాయి.
*కేశాలకు బలం
ఈ పళ్లలోని పాలిఫినాల్స్‌, ఫ్లావనాయిడ్స్‌ వంటివి చర్మం ముడతలు పడకుండా చూస్తాయి. సపోట గింజల నూనె కేశాలకు తేమను అందిస్తుంది, వెంట్రుకల్ని సుతిమెత్తగా చేస్తుంది. అంతేగాక జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.