Agriculture

“సాగువీరుడా–సాహిత్యాభివందనం” పేరిట రైతులతో తానా కార్యక్రమం

“సాగువీరుడా–సాహిత్యాభివందనం” పేరిట రైతులతో తానా కార్యక్రమం - TANA Conducts Virtual Event With Farmers - Saaguveeruda Sahityaabhivandanam

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి నాడు “సాగువీరుడా! – సాహిత్యాభివందనం” పేరిట అంతర్జాలంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి తన స్వాగతోపన్యాసంలో రైతు పాత్ర అతి విలువైనది అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ రైతుల కష్టాలను కవిత్వ రూపంలో అందించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ మానవాళికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్న రైతును అనునిత్యం స్మరించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సేద్యం చేస్తున్న రైతు ప్రత్యక్ష దైవం అన్నారు. మరచిపోతున్న కొన్ని పదాలు – ఎలాపట, దాపట; చ్చో చ్చో, హహయి; తాబేటికాయ, ఏతాము, బల్లకట్టు, బుంగపోత లాంటి వ్యవసాయ పారిభాషిక పదాలను ఆసక్తికరంగా వివరించారు.

“రైతు కోసం తానా” ద్వారా తానా చేస్తన్న కృషిపై డా. కోట జానయ్య…రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం, రైతు నేస్తం ఫౌండేషన్, ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం అనే మొబైల్ వ్యాన్ ద్వారా లక్షలాది మంది రైతులను చైతన్యపరుస్తున్న తీరు, సిరి ధాన్యాలను, మిద్దె తోటల సాగు శిక్షణా కార్యక్రమాలపై పద్మశ్రీ డా. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు….500 మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న వైనంపై కొత్తగూడెం రైతు బి.టెక్ రవి(హైబ్రిడ్ సీడ్స్)…రైతు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న కళ్ళెం ఉపేందర్‌రెడ్డి…కెనడాలో కూరగాయల వ్యాపారంపై శ్రీధర్ ముండ్లూరు…ఆదర్శ వ్యవసాయంపై కృష్ణాజిల్లా రైతు ఉప్పల ప్రసాదరావు తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గీతరచయితలు, గాయకులు – వందేమాతరం శ్రీనివాస్, మారెన్న (అనంతపురం), మానుకోట ప్రసాద్(హైదరాబాద్), నూజిళ్ళ శ్రీనివాస్(రాజమండ్రి), కృష్ణవేణి(తిరుపతి), లెనిన్ బాబు (అనంతపురం), రత్నం(చిత్తూరు), డా.అరుణ సుబ్బారావు(హైదరాబాద్), నాగమల్లేశ్వరరావు (అమరావతి), లక్ష్మణ మూర్తి (తూముకుంట), గిద్దె రామనరసయ్య (వరంగల్) తదితరులు పాల్గొని రైతు నేపథ్య సాహిత్యంతో కూడిన గెతాలాపన చేశారు.