Business

భారీగా ICICI లాభాలు

ICICI Records Good Profits In 2020 Oct-Dec Period

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,498.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,670.10 కోట్లతో పోలిస్తే లాభం 17.73 శాతం పెరగడం గమనార్హం. స్టాండలోన్‌ పద్ధతిలోనూ నికర లాభం రూ.4,146.46 కోట్ల నుంచి 19.12 శాతం వృద్ధి చెంది రూ.4,939.59 కోట్లకు చేరింది. అయితే రిటైల్‌ రుణాల విభాగంలో మొండి బకాయిలు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.9,912 కోట్లకు చేరింది. దేశీయంగా రుణాల్లో 13 శాతం వృద్ధి నమోదుకావడం ఇందుకు దోహదం చేసింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.57 శాతం నుంచి 3.67 శాతానికి పెరిగింది. వడ్డీయేతర ఆదాయం రూ.4,043 కోట్ల నుంచి రూ.3,921 కోట్లకు తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ.23,638 కోట్ల నుంచి రూ.24,416 కోట్లకు పెరగగా.. మొత్తం వ్యయాలు రూ.16,089 కోట్ల నుంచి తగ్గి రూ.15,596 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 4.38 శాతంగా నమోదైంది. రుణ చెల్లింపుల మారటోరియానికి సంబంధించి ఎన్‌పీఏల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వకుంటే ఈ నిష్పత్తి 5.42 శాతంగా ఉండేది. మొత్తం కేటాయింపులు రూ.2,741 కోట్లకు పెరిగాయి. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఇవి రూ.2,083 కోట్లుగా ఉన్నాయి. అయితే జులై- సెప్టెంబరులో కేటాయించిన రూ.2,995 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను అనుసరించి ఎన్‌పీఏలుగా వర్గీకరించని ఖాతాల కోసం అత్యవసర కేటాయింపుల కింద రూ.3,012.16 కోట్లను ఐసీఐసీఐ బ్యాంక్‌ పక్కనపెట్టింది. కరోనా మహమ్మారి సంక్షోభం కోసం కేటాయించిన రూ.8,772.30 కోట్లలో రూ.1,800 కోట్లను బ్యాంకు వినియోగించింది. ఆర్‌బీఐ నిర్దేశించిన దాని కంటే కూడా అధికంగా కేటాయింపులు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. తమ మూలధన స్థితి బలంగా ఉందని పేర్కొంది.