Devotional

బొట్టు ఎందుకు అడిగేవారికి….

బొట్టు ఎందుకు అడిగేవారికి….

హిందూ ధర్మంలో తిలకధారణకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. సనాతన ధర్మాన్ని, వేదాన్ని నమ్మే సంకేతమే ముఖాన బొట్టు. ఇది ఆడవారికి మాత్రమే పరిమితం కాక స్త్రీ పురుషులు ఇద్దరికీ అవసరమే. యోగశాస్త్ర ప్రకారం కుడి, ఎడమ ముక్కు రంధ్రాల పేర్లు పింగళ, ఎడ. ఈ రెండు నాడులు ఏటవాలుగా పైకి వెళ్లి రెండు కనుబొమల మధ్యన మూలాధారం నుండి వచ్చిన సుషుమ్న నాడితో త్రివేణి సంగమం లాగా కలుస్తాయి. అందుకని, ఈ ప్రదేశాన ఒత్తి పెట్టి బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరంలోని సర్వ ఇంద్రియ వ్యవస్థ చైతన్యమవుతుంది. ఫలితంగానే శరీరంలోని 72 వేల నాడులు సవ్యంగా పని చేస్తాయి. శరీరంలోని షట్చక్రాలలో ఆరవది ఆజ్ఞా చక్రం. వేదజ్ఞాన పరంగా ఇది అమ్మవారి స్థానం. అమ్మవారి రంగు, ధరించే వస్త్రం, అన్నీ ఎరుపు అని లలితా సహస్ర నామాల్లో ఉంది. ఎందుకంటే, సృష్టికి మూలం రజోగుణమైన చైతన్యానికి సంకేతమైన ఎరుపు రంగు. అందుకే, ఎర్రటి కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించాలి. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపంగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో, అనాహత చక్రం (హృదయ స్థానం)లో ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం ప్రతి పురుషుడి వెలుగులో ఒక స్త్రీ ఛాయ ఉంటుంది. స్త్రీ సౌభాగ్యమే పురుషుడి అంగరక్ష. సౌభాగ్య చిహ్నాలుగా స్త్రీలు ధరించే కొన్నింటిలో మొట్టమొదటిది బొట్టు. రెండవది మంగళసూత్రం. ‘పెండ్లి కాకముందు పెట్టుకునే బొట్టు లక్ష్మీకళకు, అనుగ్రహానికి చిహ్నంగా ఉంటే, పెండ్లి తర్వాత స్త్రీ ధరించే బొట్టు భర్త ఆయుర్దాయానికి ప్రతీక’ అని శాస్త్రం చెప్పింది.