DailyDose

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ భాజపా నేత-నేరవార్తలు

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ భాజపా నేత-నేరవార్తలు

* పశ్చిమబెంగాల్‌లో డ్రగ్స్‌ తరలిస్తూ పట్టుబడిన భాజపా యువమోర్చా నేత వ్యవహారం మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమబెంగాల్‌ ఎన్నికల వ్యవహారాల బాధ్యుడు కైలాష్‌ విజయ్‌ వర్గీయ అనుచరుడు రాకేశ్‌ సింగ్‌ పేరు తెరపైకి రావడం ఆసక్తిగా మారింది. రాకేశే తనను ఇరికించాడంటూ డ్రగ్స్‌తో పట్టుబడిన పమేలా గోస్వామి ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకే సంబంధమూ లేదని రాకేశ్‌ సింగ్‌ చెప్పగా.. ఇదే అదునుగా భావించిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై విమర్శలు గుప్పిస్తోంది.

* తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచిన గంటా చంద్రకళ మరిది ప్రదీప్‌కుమార్‌పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి తెగబడ్డారు. బాధితుడిని అమలాపురం కిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రదీప్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన సఖినేటిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా అంతర్జాతీయ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి ఏపీలోని గన్నవరానికి వస్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ప్రమాదం సమయంలో విమానంలో 64మంది ప్రయాణికులు ఉన్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. అయితే, ప్రయాణికులంతా సురక్షితంగానే బయటపడటంతో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్‌ సమయంలో ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాన్ని తాకిందా? లేదంటే ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

* పెద్దపల్లి జిల్లాలో లాయర్‌ దంపతుల హత్యల విషయంలో నిందితుల బరితెగింపునకు కారణాలపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంథని నియోజకవర్గంలో కొందరు పోలీస్‌ అధికారులు రాజకీయ నేతలతో మితిమీరిన స్నేహం కొనసాగిస్తుండడమే నిందితుల ధీమాకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసుల సహకారంతో తప్పించుకోగలుగుతామనే ధైర్యంతోనే వారు అంతకు తెగించారనే భావన కలుగుతోంది. నేరస్థలిలో ఆధారాల్ని జాగ్రత్తగా కాపాడటంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది.

* హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. వీరిని మంథనిలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు శుక్రవారం రాత్రి హాజ‌రు ప‌రచగా న్యాయమూర్తి నాగేశ్వరరావు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకు ముందు వీరికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు.