Business

CNG కార్ల తయారీ పెంచుతున్న మారుతీ-వాణిజ్యం

Business News - Maruti To Hike Production Of CNG

* పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో ‘సీఎన్‌జీ’తో న‌డిచే కార్ల త‌యారీని, అమ్మ‌కాల‌ను మారుతీ సుజుకి క్ర‌మంగా పెంచుతోంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రంలో సీఎన్‌జీ (కంప్ర‌స్‌డ్ నేచుర‌ల్ గ్యాస్‌)తో న‌డిచే కార్ల అమ్మ‌కాలు 59% పెరుగుతాయ‌ని ఆశిస్తోంది. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డం మ‌రియు గ్యాస్ యొక్క విస్తృత ల‌భ్య‌త మ‌ధ్య ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ సీఎన్‌జీ వాహ‌నాలనే ఆశ్ర‌యిస్తార‌ని మారుతి భావిస్తోంది.

* భారత్‌లో కొత్త పెట్టుబడులు పుంజుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అందుకు ప్రైవేట్‌ వ్యాపార వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ)’ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు ఊపందుకునేలా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. ముఖ్యంగా కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత పరిశ్రమ వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని భావించామన్నారు.

* కార్మిక మార్కెట్లపై కొవిడ్‌-19 ప్రభావం భారీగా పడిందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది. కరోనా పరిణామాల ప్రభావంతో 2030కి సుమారు 1.8 కోట్ల మంది భారతీయులు బలవంతంగా కొత్త వృత్తిలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. రిటైల్, ఆహార సేవలు, ఆతిథ్యం, కార్యాలయ పాలనా విభాగాల్లోని ఉద్యోగాలపై కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. ‘కొవిడ్‌ మహమ్మారి కార్మిక మార్కెట్లను దెబ్బ తీసింది. కంపెనీల్లో భౌతిక దూరం పాటించాల్సి రావడంతో కొత్త పని విధానానికి మారాల్సి వచ్చింద’ని వివరించింది.

* కేంద్ర విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు, దీని ద్వారా పాస్‌పోర్ట్ కోసం ఎక్క‌డైనా దరఖాస్తు చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాల కోసం డిజిలాక‌ర్‌ను అనుమ‌తించింది. డిజిలాక‌ర్‌లో ఉన్న డాక్యుమెంట్ల‌ను దృవీక‌ర‌ణ కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు.

* కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొరడా ఝుళిపించింది. లిక్విడిటీ కొరత నేపథ్యంలో దక్కన్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ కార్యకలాపాలపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఈ బ్యాంకు ఖాతాదారులు ఆరు నెలల కాలానికి తమ పొదుపు ఖాతా నుండి రూ .1000 కన్నా ఎక్కువ ఉపసంహరించుకోలేరు. ఈ మేరకు బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీచేసినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది. అయితే బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు కాదని, తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు ఆంక్షలతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.