Health

కరోనా వ్యాక్సిన్‌కు కేరళ వాసుల విరాళాలు

కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తామని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రం కేరళ కూడా ఉంది. అయితే ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయం అందిస్తున్నారు కేరళ వాసులు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకాల కొనుగోలు కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలిస్తున్నారు. రెండు రోజుల క్రితం మొదలైన ఈ సోషల్‌మీడియా క్యాంపెయిన్‌లో ఇప్పటికే వేల మంది భాగస్వాములై సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నిధులు పంపిస్తున్నారు. కేరళకు చెందిన రావణన్‌ కన్నూర్‌ ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. ఇటీవల కువైట్‌ ప్రభుత్వం అతడికి ఉచితంగా టీకా అందించింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘నేను ఉచితంగా టీకా పొందాను. స్వదేశంలో ఉన్న నా కుటుంబసభ్యుల కోసం కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నా వంతు సాయం చేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. రావణన్‌ ఆలోచనకు మెచ్చుకున్న పలువురు నెటిజన్లు తామూ సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. దీంతో గురువారం ఒక్క రోజే సీఎం సహాయనిధికి రూ. 50లక్షల విరాళాలు రావడం విశేషం.