Movies

అనూహ్యతే నా అదృష్టం

అనూహ్యతే నా అదృష్టం

‘‘వ్యక్తిగత జీవితంలోనే కాదు… నా సినీ ప్రయాణంలోనూ అనూహ్యంగా జరిగిన పరిణామాలే ఎక్కువ’’ అంటోంది ప్రగ్యా జైస్వాల్‌. మనం ఏమాత్రం ఊహించకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ తృప్తితోపాటు, ఎక్కువ బాధ్యతనీ పెంచుతాయని చెబుతోందీమె. ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి ‘అఖండ’లో నటిస్తోంది ప్రగ్యా. హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. బాలకృష్ణతో కలిసి నటించే అవకాశమూ ఈమెకి అనూహ్యంగానే దక్కింది. ‘‘తొలినాళ్లల్లో పేరున్న నటులు, దర్శకులతో కలిసి నటించాలని ఆశించేదాన్ని. అందుకు తగ్గట్టుగానే తక్కువ సమయంలోనే అలాంటి ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకున్నా. ఆ తర్వాత నేను ఊహించకుండానే… విభిన్నమైన కథల్లోనూ, పాత్రల్లోనూ నటించే అవకాశం దొరికింది. అవి మరో రకమైన అనుభవాన్నీ, సంతృప్తినీ పంచాయి. ఇప్పుడు నా ఆలోచనల్లోని పరిణతి, అనుభవం ప్రతి రోజునీ మరింత పరిపూర్ణంగా ఆస్వాదించేందుకు కారణం అవుతున్నాయ’’ని చెప్పుకొచ్చింది ప్రగ్యా. ఎప్పటికప్పుడు ఫొటో షూట్‌లతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటుందీ ట్రెండీ భామ.