WorldWonders

ఇది ఒక “చెత్త” పగ కథ

ఇది ఒక “చెత్త” పగ కథ

మీరు ఎన్నో భయంకరమైన పగల గురించి వినుంటారు. కానీ న్యూయార్క్‌లో ఒకాయన పగ గురించి వింటే మాత్రం నవ్వొచ్చేస్తుంది. ఇంతకీ ఆ కథేంటంటే… ఎడ్వర్ట్‌ పాటన్‌, చెరిల్‌ పాటన్‌ అనే జంట న్యూయార్క్‌లో ఉంటోంది. మూడేళ్లుగా రోజూ వాళ్ల ఇంటి లాన్లో వాడేసిన కాఫీ కప్పులు, టిష్యూలు కనిపించేవి. మొదట్లో ‘ఎవరో పొరపాటున వేసుంటార్లే’ అనుకున్నారు. తర్వాత రోజూ ఒకే సమయంలో, ఒకే దగ్గర చెత్త పడటం చూసి, ‘చుట్టుపక్కల వాళ్లెవరైనా కావాలనే ఇలా చేస్తున్నారేమో పట్టుకుందాం’ అని అక్కడ ఓ సీసీ కెమెరాను ఉంచారు. ఎవరో కారులో వచ్చి చెత్త వేస్తున్నట్లు కెమెరాలో కనిపించింది కానీ ఆ కారు నెంబరు అందులో కనిపించలేదు. ఈసారి పక్కింటి వాళ్ల సాయంతో కాపు కాచి, చెత్త వేస్తున్న వ్యక్తి కారు నెంబరు సంపాదించి పోలీసులకు ఇచ్చారు. తీరా ఆయన ఎవరో తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ చెత్త వేసిన వ్యక్తి వయసు 76 ఏళ్లు. అతని పేరు లారీ పోప్‌. అతను చెరిల్‌తో కలిసి గతంలో ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పని చేసేవాడు. అప్పుడు ఇద్దరి మధ్యా జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకుని ఇలా చేశాడట. ఈ విషయం విన్నవారంతా ‘ఇలా కూడా పగ తీర్చుకుంటారా…!’ అని ఆశ్చర్యపోతున్నారు!