Health

పాకిస్థాన్‌లో చైనా వ్యాక్సిన్ తయారీ-తాజావార్తలు

China vaccine to be made in Pakistan - News Roundup

* చైనా తన వ్యాక్సిన్‌ వినియోగాన్ని పాకిస్థాన్‌లో విస్తరిస్తోంది. తాజాగా చైనా కాన్‌సినో కొవిడ్-19 టీకా తయారీని పాకిస్థాన్‌లో ప్రారంభించింది. ఇది సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్‌. పాకిస్థాన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో ఈ వ్యాక్సిన్‌ తయారీ ప్లాంట్‌ను ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో నెలకు 30లక్షల టీకాలను తయారు చేయనున్నారు. దీంతో పాకిస్థాన్‌ టీకా దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మేనెల చివరి నాటికి టీకాల మొదటి బ్యాచ్‌ అందుబాటులోకి రానుంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ప్రత్యేక సహాయకుడు ఫైసల్‌ సుల్తాన్‌ ఈ విషయంపై ట్వీట్‌ చేశారు. తమ కొవిడ్‌ టీకాల అవసరాలను ఇది భారీగా తీరుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైనా నుంచి దిగుమతి చేసుకొన్న టీకాల్లో 91శాతం కొనుగోలు చేయగా.. 9శాతం బహుమతిగా లభించాయి. పాక్‌లో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలను వేస్తున్నారు. ‘‘పాకిస్థాన్‌ ఇప్పటికే 30 మిలియన్‌ డోసుల టీకాల కొనుగోలుకు డీల్స్‌ కుదుర్చుకొంది. ఈ ఏడాది చివరి వరకు కొనుగోళ్లు ఆగవు. ఇది ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది’’ ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

* ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా వైరస్‌ కేసుల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఓ అధికారి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 18 లేదా 19న మిగతా సీజన్‌ ప్రారంభమవుతుందని మూడు వారాల్లో టోర్నీని పూర్తి చేస్తామని చెప్పారు. దాంతో అక్టోబర్‌ 9 లేదా 10వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుందని తెలిపారు. ఈ క్రమంలోనే పది రోజులు డబుల్‌ హెడర్స్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తామని అన్నారు. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎక్కడా ప్రకటన జారీ చేయలేదు.

* కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు ప్రత్యేక టీకా డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది. సూపర్‌ స్ప్రెడర్ల గుర్తింపు కోసం విధివిధానాలు ఖరారు చేయాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు వ్యాక్సినేషన్‌పై సీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు టీకా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మందిని సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించారు. మొదట జీహెచ్‌ఎంసీలోని సూపర్‌ స్ప్రెడర్లకు టీకాలు వేయనున్నారు.

* దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వాటి సంఖ్య రెండు లక్షల దిగువకు చేరింది. రోజూవారీ కేసుల తగ్గుదలతో పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అది 9.54 శాతంగా ఉందని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే వరసగా 12వ రోజు కూడా పాజిటివ్‌ కేసులు కంటే రికవరీలే అధికంగా ఉండటం ఊరటనిస్తోంది.

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు. లోకాయుక్త ఆదేశంలో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని, మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారు. కరోనాతో బాధపడుతున్న వారు హఠాత్తుగా మందు పంపిణీ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.

* దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతున్న వేళ.. ఉత్పత్తి, సరఫరాను పెంచేందుకు తయారీ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొవాగ్జిన్‌ టీకాను గడిచిన 30 రోజుల్లో 30 నగరాలకు సరఫరా చేశామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దేశంలో చేపడుతున్న వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు సంస్థ సిబ్బంది కట్టుబడి ఉన్నారని.. ఇందుకోసం లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ 24క్ష్7 కృషిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. సిబ్బందిలో కొంతమంది వైరస్‌ బారినపడగా మరికొందరు క్వారంటైన్‌లో ఉన్నారని.. వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పేర్కొన్నారు.

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఏపీ సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్‌ వినీత్‌ శరన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్‌ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అనుమతి కోరారు. కేంద్ర ప్రభుత్వం మినహా ఏపీ ప్రభుత్వం, ఏపీ డీజీపీ వంటి ప్రతివాదులను జాబితా నుంచి తొలగించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు తెలిపారు.

* తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యాస్‌ తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కనిపించలేదన్నారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్‌ రోగులు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

* తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైకాపా ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో కర్నూలు జిల్లా నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జనార్దన్‌ రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు వచ్చి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారని ఆరోపించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని చంద్రబాబు నిలదీశారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.