Business

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము భారీగా పెరిగింది-వాణిజ్యం

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము భారీగా పెరిగింది-వాణిజ్యం

* స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద ఏడాది వ్యవధిలో భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు చేరిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ అధికారుల్ని కోరినట్లు తెలిపింది. ‘‘స్విస్‌ బ్యాంకుల్లో 2019 ఆఖర్లో రూ.6,625 కోట్లుగా ఉన్న భారతీయుల సంపద 2020 చివరి నాటికి భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత రెండేళ్లుగా తగ్గుముఖం పట్టిన ఈ సంపద తిరిగి పెరిగిందని పేర్కొన్నాయి. అలాగే గత 13 ఏళ్లలో ఈసారే అత్యధిక డిపాజిట్లు నమోదైనట్లు తెలిపాయి’’ అని ఆర్థిక శాఖ తెలిపింది.

* కొవిడ్‌ నేప‌థ్యంలో ఇంటి వ‌ద్దే ప‌లు ర‌కాల బ్యాంకింగ్‌ సేవ‌లు అందించేందుకు సిద్ధ‌మైంది ఎస్‌బీఐ. ఇంటి వ‌ద్దే క్షేమంగా ఉండండి.. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను బ్యాంకుకు రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండానే అందిస్తామంటోంది. ఇందులో భాగంగానే ఏటీఎం కార్డు పోతే బ్యాంకుకు వెళ్లే అవసరం లేదని చెప్తోంది. పాత కార్డును బ్లాక్‌ చేయడంతో పాటు కొత్త డెబిట్‌ కార్డును కూడా ఫోన్ ద్వారానే పొందొచ్చని పేర్కొంటోంది. ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ డెబిట్ కార్డును పోగొట్టుకున్న‌ట్లు గుర్తిస్తే ఫోన్ ద్వారా వెంట‌నే కార్డును బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం ఎస్‌బీఐ రెండు టోల్‌ఫ్రీ నంబర్లు కేటాయించింది. 1800 112 211, 1800 425 3800 వీటిలో ఏదో ఒకదానికి కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఖాతాదారుల‌కు అత్య‌వ‌స‌ర బ్యాంకింగ్ సేవ‌ల అందించ‌డం కోసం ఈ రెండు నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు ఎస్‌బీఐ వెల్ల‌డించింది.

* ఆన్‌లైన్‌లో పెరుగుతున్న మోసాల గురించి స్టేట్‌బ్యాక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న ఖాతాదారుల‌ను హెచ్చ‌రించింది. నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొందరు మోస‌గాళ్లు బ్యాంకు/ సంస్థ ప్ర‌తినిధిగా మేసేజ్ పంపి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ఎస్‌బీఐ తన ట్విటర్‌లో పేర్కొంది.

కొవిడ్‌ రెండో వేవ్‌ నేపథ్యంలో ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌డంతో ఖాతాదారులు బ్రాంచ్‌కు వ‌చ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌ను దృష్టిలో ఉంచుకుని కేవైసీ అప్‌డేట్‌కి కావ‌ల‌సిన ప‌త్రాల‌ను మెయిల్ ద్వారా గానీ, పోస్ట్ ద్వారా గానీ పంపేందుకు ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ ఇటీవ‌లే అనుమ‌తించింది. ఈ విధానంలో కేవైసీ అప్‌డేట్ చేసుకునేవారు కూడా అప్రమత్తంగా ఉండాల‌ని బ్యాంక్ సూచించింది. మోసాల బారిన పడకుండా ఎస్‌బీఐ సూచనలు. ఏదైనా లింక్‌ను క్లిక్‌ చేసేముందు ఆలోచించండి. కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించ‌దన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ మొబైల్ నంబర్‌, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.