NRI-NRT

ఏపీ ఫైబర్‌నెట్‌పై సీఐడీ దర్యాప్తు. డాలస్‌లో ప్రకంపనలు.

ఏపీ ఫైబర్‌నెట్‌పై సీఐడీ దర్యాప్తు. డాలస్‌లో ప్రకంపనలు. - AP CID To Investigate Scam In AP Fiber Net - Dallas Based Then Participants Under Scrutiny

ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌, కేబుల్‌ కనెక్షన్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. సెట్‌ టాప్‌ బాక్సులు సహా సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. వీటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. గుత్తేదారుకు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విమర్శలు వచ్చాయి. అవకతవకలపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ, ఛైర్మన్‌లు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఖల ద్వారా కోరారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన మీదట కేసు దర్యాప్తును ఏపీ నేరపరిశోధన విభాగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరణాత్మక నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది.