Politics

జగనో గజనీ-తాజావార్తలు

జగనో గజనీ-తాజావార్తలు

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల.గడిచిన 24 గంటల్లో 465 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు.కొత్తగా 4 కొరొనా మరణాలు- మొత్తం 3729 చేరిన సంఖ్య.రాష్ట్రంలో 10 316 అక్టీవ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి.జిహెసెంసి- 70, కరీంనగర్ 42, ఖమ్మం 32, సూర్యాపేట 33 కేసులు నమోదు.

* ఉత్తరప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఐఏఎస్ అధికారులు సైతం విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. ఓ టీవీ రిపోర్ట్‌ను ఐఏఎస్ అధికారి వెంటపడి పట్టుకుని కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మియాగంజ్‌లో చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(సీడీవో)గా విధులు నిర్వర్తిస్తోన్న దివ్యాన్షు పటేల్ జర్నలిస్టుపై దాడికి పాల్పడడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టు సెల్‌ఫోన్‌తో అక్కడ నెలకొన్న పరిస్థితులను షూట్‌ చేస్తుండగా దివ్యాన్షు పటేల్ రెచ్చిపోయాడు.పోలీసులు అడ్డుపడడంతో ఆ జర్నలిస్టు తప్పించుకోగలిగాడు. కాగా, దివ్యాన్షు పటేల్ పై ఆ జర్నలిస్టు పలు ఆరోపణలు చేశాడు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్‌ కౌన్సిల్‌ సభ్యులను కొందరిని కిడ్నాప్‌ చేశారని ఆయన చెప్పారు. ఇందులో దివ్యాన్షు ప్రమేయం కూడా ఉందని తెలిపాడు. ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దాడి చేశాడని అన్నాడు. దీనిపై దివ్యాన్షు స్పందిచంలేదు. ఈ దాడి ఘటనపై జర్నలిస్టు నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు స్థానిక కలెక్టర్ తెలిపారు.

* తుళ్లూరులో ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని రాజధాని రైతులు స్పష్టం చేశారు.

* ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.నాపై అనర్హత వేటు వేసేందుకు చేస్తున్న గజనీ దండయాత్రలపై సీఎంకు లేఖ రాసినట్లు రాఘురామ పేర్కొన్నారు.అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఏడుసార్లు వినతి పత్రం ఇచ్చారని, యధా రాజా తధా మంత్రి అన్నట్లు సాయి రెడ్డి మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.రఘురామపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామంటూ.. విజయసాయిరెడ్డి స్పీకర్‌ను నేరుగా హెచ్చరించే సాహసానికి ఒడిగట్టారని రఘురామ అన్నారు.విజయసాయిరెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చానని రఘురామకృష్ణరాజు లేఖలో తెలిపారు.పార్లమెంటును స్థంభింప చేసే శక్తే ఉంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం నిధుల కోసం.. ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు.

* జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే చెప్పామని.. ప్రజలు తమ మాట వినలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం వేస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో 19వ డివిజన్‌ తెదేపా నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి కేశినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ అభివృద్ధికి రూ.480కోట్లు తెచ్చి కార్యక్రమాలు చేపట్టామని.. ఇప్పుడు నగరం మురికి కుంటలా తయారైందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని.. ఆ ఇద్దరూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, జగన్, షర్మిల ముగ్గురూ ముగ్గురేనని.. వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని కేశినేని నాని వ్యాఖ్యానించారు.

* ప్రియుడి వ్యామోహంతో తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లో నుంచి గెంటేసిన ఓ మహిళ నాలుగో వివాహానికి సిద్ధమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. భిండ్ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారు సహజీవనం కూడా చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. రెండో కుమార్తెను ఏడాది క్రితమే ఇంట్లో నుంచి తరిమేసింది. ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది. ఈ వివాహానికి అడ్డు చెబుతున్న నలుగురు కుమార్తెలను బయటకు పంపేసింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.

* అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా వర్జిన్‌ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్‌ఎస్‌ యూనిటీ-22 వ్యోమనౌన రోదసీలోకి బయలుదేరింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ఇందులో ప్రయాణిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళుతుండగా అందులో 34 ఏళ్ల తెలుగమ్మాయి బండ్ల శిరీష కూడా ఉన్నారు. అయితే, వాతావరణ మార్పుల కారణంగా అంతరిక్ష ప్రయాణం కాస్త ఆలస్యం అయ్యింది. నిర్దేశిత సమయానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా వ్యోమనౌక బయలుదేరింది. మొత్తం 90 నిమిషాల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. తొలిసారి అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లిన ప్రయోగంగా యూనిటీ-22 రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఇప్పటివరకూ భారత్‌ నుంచి రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. తాజాగా నాలుగో వ్యక్తిగా బండ్ల శిరీష చరిత్ర సృష్టించారు. ఈ ప్రయాణం గురించి స్పందించిన శిరీష.. యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడం అదృష్టమంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే 3 సార్లు స్పేస్‌ ఫైట్లను వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షంలోకి పంపగా తాజా ప్రయోగంలో తొలిసారి మనుషులను రోదసీలోకి తీసుకెళ్లింది.

* అల్లం బస్తాల మధ్యలో గంజాయి మూటలను తరలిస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గజపతినగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని ఈ ఉదయం వై జంక్షన్‌ వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో 3వేల కేజీల గంజాయి వెలుగు చూసింది. వ్యాన్‌ డ్రైవర్‌ సత్యభాన్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. సిమిలిగూడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు గంజాయి తరలిస్తున్నట్టు అంగీకరించాడు. దిల్లీ నుంచి కుర్చీలు సిమిలిగూడ తీసుకొచ్చానని, తిరుగు ప్రయాణంలో యజమాని వితన్‌ కుమార్ సూచనల మేరకు గంజాయి బస్తాలను తరలిస్తున్నట్టు చెప్పాడు. డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో ఆగ్రాకు చెందిన అరవింద్‌కుమార్‌, కొరాపుట్‌కు చెందిన భరత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. గంజాయి లోడుతో వెళ్తున్న వాహనం వెనుకనే వీరిద్దరూ మరో గస్తీ వాహనంలో వెళుతున్నట్లు ఎస్పీ చెప్పారు.