Sports

గంగూలీ తర్వాతే ఎవరైనా…

గంగూలీ తర్వాతే ఎవరైనా…

టీమ్‌ఇండియా ఉత్తమ సారథుల్లో సౌరభ్‌ గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ ముందు వరుసలో ఉంటారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరు అత్యుత్తమం అని అడిగితే పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. దాదా పేరునే ఎంచుకున్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానెల్‌తో ముచ్చటించిన సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో భాగంగానే మాజీ సారథి గంగూలీనే టీమ్‌ఇండియాకు అత్యుత్తమ కెప్టెన్‌ అని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు తాను బౌలింగ్‌ చేసిన అత్యంత కష్టమైన బ్యాట్స్‌మెన్‌ ఎవరని అడిగిన ప్రశ్నకు ఆల్‌టైమ్‌ స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరు చెప్పాడు. ఈ విషయంలో జోక్‌ చేయట్లేదన్నాడు. ‘‘నేను బౌలింగ్‌ చేసిన వారిలో శ్రీలంక మాజీ స్పిన్నర్‌ మురళీధరనే అత్యంత కష్టతరమైన బ్యాట్స్‌మన్‌. ఈ విషయంలో జోక్‌ చేయట్లేదు. అతను నా వద్దకొచ్చి ‘బౌన్సర్లతో నన్ను చంపొద్ద’ని కోరేవాడు. నేను బౌన్సర్‌ విసిరితే అతను చస్తానన్నాడు. బంతిని కాస్త పైకి విసిరితే వికెట్‌ ఇస్తానని చెప్పేవాడు. అలా అతను చెప్పినట్లే నేను బంతి వేయగానే దాన్ని కొట్టేవాడు. తర్వాత నా వద్దకొచ్చి ‘అనుకోకుండా కొట్టాన’ని చెప్పేవాడు’’ అని అక్తర్‌ వివరించాడు. మరి ఇది నిజమో కాదో వాళ్లిద్దరికే తెలియాలి. ఇక కోల్‌కతాలో సచిన్‌ను ఔట్‌ చేసింది ఇష్టమా లేక తన ఫాస్టెస్ట్‌ డెలివరీ (161 కిమీ వేగం 2003 ప్రపంచకప్‌లో) ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు అతడు తెందూల్కర్‌ వికెట్‌కే ప్రాధాన్యమిచ్చాడు.