ScienceAndTech

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఇష్టారాజ్యంగా ఉంది-తాజావార్తలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఇష్టారాజ్యంగా ఉంది-తాజావార్తలు

* సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని, తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.  తారకరామారావు కోరారు. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని, గతంలోనూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసి వేసిందని, ఈ మూసివేత లక్షలాదిమందికి అనేక ఇబ్బందులు తీసుకువస్తుందని కేటీఆర్ అన్నారు. పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని, ప్రస్తుతం అదుపులో ఉన్న కరోనా పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. లోకల్ మిలటరీ అథారిటీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 258 కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్ తన లేఖలో రాజ్నాథ్ సింగ్ కు గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలని, అయితే తమ ఇష్టారీతిన అత్యంత చిన్న చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్ల మూసివేస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు.

* సెక్షన్ 124 ఏను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో, చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ, రిటైర్డ్ మేజర్ జనరల్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్ కేర్ పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌‌పై విచారణ నిర్వహించింది. రాజద్రోహం కింద కేసు నమోదు చేసి.. సెక్షన్ 124ఏ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124 ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఉన్నాయన్నారు. ఇంకా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం అసన్నమైంది. పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు?” అని అన్నారు.

* ఈనెల 19 నుండి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు ప్రారంభం

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు.పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు.

* రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. కొన్ని కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఎగువున కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

* హరియాణా గవర్నర్​గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం.

* ప్రధాని నరేంద్ర మోదీ వారణాసికి చేరుకున్నారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆయనకు స్వాగతం పలికారు.

* హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా మాజీ ఎంపీపీ, కొండూరు మల్లికార్జున స్వామిని నియమించిన ఏపీ ప్రభుత్వం

* పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ రేపు చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

* తెలుగు అకాడమీని తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేయడాన్ని యావత్‌ తెలుగు జాతి వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. తెలుగు-సంస్కృత అకాడమీ అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా ఈ నిర్ణయాన్ని సమర్థించేవారు ఎవరూ లేరని తెలిపారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

* ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పిన సీఎం జగన్‌.. ఇప్పుడు అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకొచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిరుద్యోగ యువతతో సమావేశమైన లోకేశ్‌ భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట సీఎం జగన్‌ జాదూ క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలకు బదులు కేవలం 10వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి పండగ చేస్కోమంటున్నారని ధ్వజమెత్తారు.

* కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఖరే కారణమని పునరుద్ఘాటించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదన్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని, నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుగుతున్నామని గుర్తు చేశారు.

* త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. సభలో వైకాపా ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా పోలవరం నిధుల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు గళం వినిపిస్తామన్నారు. కేఆర్‌ఎంబీ పరిమితిని కేంద్రం నోటిఫై చేయాలని కోరుతామన్నారు

* పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ రేపు చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు రేవంత్‌ వెల్లడించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యమైందని, రేపు తమ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు.

* కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

* కరోనా వైరస్‌ను ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అద్భుతంగా కట్టడి చేయగలిగిందని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో గురువారం పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అభినందించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ మైదానంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* గతకొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి ఓ తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూల జరుగుతోన్న కోల్డ్‌వార్‌ పరిష్కరానికి కాంగ్రెస్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూనే, నవజోత్‌ సింగ్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధమైనట్లు సమాచారం.

* తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఇద్దరు సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కాలవ మీడియాతో మాట్లాడారు. జలవివాదంపై అనవసర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించడం లేదనటం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సీఎం జగనా? లేక చంద్రబాబా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదు? జలవివాదాలపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదు? లేఖలు రాస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?అని ప్రశ్నించారు. జలవివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.