WorldWonders

యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ ఇంట్లో 76 లక్షల నగదు స్వాధీనం

యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ ఇంట్లో 76 లక్షల నగదు స్వాధీనం

భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. గురువారం ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ విషయంలో మధ్యవర్తి ప్రభాకర్‌తో కలిసి రూ.20వేలు లంచం తీసుకున్న అరోపణలతో సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మేడిపల్లిలోని దేవానంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లు, 200 గజాల ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. నిందితులిద్దరిని హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించారు.
సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ గురువారం అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కారు. హైదరాబాద్‌, యాప్రాల్‌కు చెందిన డాక్టర్‌ సత్యం మడె అనే స్థిరాస్తి వ్యాపారి 2008లో ఆలేరు మండలం కొలనుపాకలో స్వీస్‌లైప్‌ గ్రీన్‌ ఏవెన్యూ అనే వెంచర్‌ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారు. అందులోని ఐదు నివాస స్థలాలను ఇటీవల కొందరికి అమ్మి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడానికి యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఆ వెంచర్‌ గ్రామ పంచాయతీ అనుమతులతో చేసిందని, వాటికి రిజిస్ట్రేషన్‌ చేయమంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ మొదట కొర్రీలు పెట్టాడు. ఆ తర్వాత డాక్యుమెంట్‌కు రూ.10 వేల చొప్పున లంచం అడిగాడు. తాను అంత ఇవ్వలేనని బాధితుడు వేడుకోగా.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రిన్స్‌ దస్తావేజు లేఖరుల కార్యాలయంలోని దస్తావేజు లేఖరి సహాయకుడు ప్రభాకర్‌ మధ్యవర్తిత్వంతో మొత్తం రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పంద చేసుకొన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకునే ప్రయత్నం చేయగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ దేవానంద్‌ను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. సంబంధిత దస్త్రాలను పరిశీలించారు. అనంతరం లంచంగా తీసుకోబోయిన డబ్బు, తీసుకున్నట్లుగా తెలిపే ఆధారాలతో సహా నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. వారిపై కేసు నమోదు చేసి, అక్రమార్జనలపై వారి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. సోదాల్లో భాగంగానే దేవానంద్‌ ఇంటి నుంచి నగదు, బంగారు ఆభరణాలు, భూములు, ఫ్లాట్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.