NRI-NRT

Flash: తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా యార్లగడ్డ ఏకగ్రీవం

Flash: తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా యార్లగడ్డ ఏకగ్రీవం

తానా ఫౌండేషన్ 2021-23 ఛైర్మన్‌గా మిస్సిస్సిప్పికి చెందిన గుంటూరు జిల్లా ప్రవాసుడు యార్లగడ్డ వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రం సమావేశమైన తానా ఫౌండేషన్ ట్రస్టీ సభ్యులు ఫౌండేషన్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బోస్టన్‌కు చెందిన వల్లేపల్లి శశికాంత్, కోశాధికారిగా డాలస్‌కు చెందిన పోలవరపు శ్రీకాంత్‌లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం కూడా 2023 వరకు ఉంటుంది.

*** 2007 నుండి తానాతో యార్లగడ్డ అనుబంధం
గుంటూరు జిల్లా రేపల్లె మండలం వెనిగళ్లవారిపాలెంకు చెందిన యార్లగడ్డ వెంకటరమణ మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని మేడిసన్‌లో నివసిస్తున్నారు. 2007-09 మధ్య తానా మిడ్‌వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధిగా పనిచేసిన ఆయన 2009-11 మధ్య తానా ఫౌండేషన్ కార్యదర్శిగా వ్యవహరించి తానా ఫౌండేషన్ ఇండియా విభాగ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. 2011 నుండి ఆయన తానా ఫౌండేషన్‌లో పలు ప్రాజెక్టుల నిర్వహణకు తోడ్పడ్డారు. ఈయన కుమారుడు శశాంక్ 2021 తానా ఎన్నికల్లో క్రీడల సమన్వయకర్తగా ఎన్నికయ్యారు. తానాలో తన పదవీకాలంలో మెజార్టీ భాగం ఫౌండేషన్‌లోనే గడిచిందని, ఆ అనుభవాలను వినియోగిస్తూ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల వ్యాప్తికి కృషి చేస్తానని యార్లగడ్డ వెంకటరమణ TNIకు తెలిపారు. ఫౌండేషన్ నూతన కార్యవర్గానికి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.