Agriculture

సాగర్ 22గేట్లు ఎత్తివేత. భారీగా జనసందోహం.

సాగర్ 22గేట్లు ఎత్తివేత. భారీగా జనసందోహం.

నల్గొండ- నాగార్జున సాగర్ రిజర్వాయర్ దగ్గర సందడి నెలకొంది. సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున వర్షాల నేపధ్యంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే నాగార్జున సాగర్ రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు, సోమవారం ఉదయం మరో 8 గేట్లను ఎత్తారు.

దీంతో ప్రస్తుతం 22 గేట్ల నుంచి దిగువకు నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 587.50 అడుగులు మేర నీరుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు, మొదటి జల విద్యుత్కేంద్రం నుంచి 30,182 క్యూసెక్కులు, రెండో జల విద్యుత్కేంద్రం నుంచి 33,549 క్యూసెక్కులు కలిపి మొత్తం 3.38 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో నాగార్జున సాగర్ డ్యాం 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

నీటి విడుదల కొనసాగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్‌కు వస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అటు శ్రీశైలం డ్యాం నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు కూడా పర్యాటకులు భారీగా వస్తున్నారు.