WorldWonders

హైదరాబాదీలకు వర్షం హెచ్చరిక-తాజావార్తలు

హైదరాబాదీలకు వర్షం హెచ్చరిక-తాజావార్తలు

* హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం ఇలాగే మరో 8 గంటల పాటు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. అవసరమైతే తప్ప రానున్న గంట సమయంలో బయటకు వెళ్లకూడదని జీహెచ్‌ఎంసీ అధికారులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. జంటనగరాల వాసులు సాయం కోసం 040- 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు.

* అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు అద్దం పట్టే ఫొటో ఇది. ముష్కరుల ఆక్రమణలతో యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్గాన్‌లో ఇప్పుడిప్పుడే రోజువారీ కార్యకలాపాలు తిరిగి మొదలవుతున్నాయి. తాజాగా కొన్ని ప్రావిన్స్‌లలో విశ్వవిద్యాలయాలు తెరుచుకోగా.. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా ఇలా తరగతి గదుల్లో పరదాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్థానిక విలేకరులు కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. అవి కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రజా ప్రభుత్వం నుంచి ముష్కరుల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో భారీ మార్పులే చోటుచేసుకుంటున్నాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చిన తాలిబన్లు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ విద్యాసంస్థలకు ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు యూనివర్శిటీలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నిఖాబ్‌ ధరించాలని తాలిబన్లు ఆదేశించారు. విద్యార్థులు, విద్యార్థులకు వేర్వేరు తరగతి గదుల్లో బోధించాలని చెప్పారు. అది కుదరకపోతే కనీసం వారి మధ్య కర్టెన్‌ వేయాలని ఆదేశించారు.

* గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయమవడం కలకలం రేపింది. బ్యాంకులో అటెండర్‌గా పని చేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు. ఈ నెల 2న బ్యాంకులో ఆభరణాల ఆడిటింగ్ జరిగింది. అదే రోజు సుమంత్ సెలవు పెట్టాడు. ఆడిటింగ్‌లో బంగారు ఆభరణాలు మాయం అవడం.. సుమంత్ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి 5 అంశాలపై లేఖలు అందించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లేన్లుగా, కల్వకుర్తి-హైదరాబాద్‌ రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం రహదారిని విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తెలంగాణలో 1,138 కి.మీ.మేర రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అలాగే రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.

* బెంగళూరులో తనకున్న ప్యాలెస్‌లను కాపాడుకునేందుకే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా ఏపీ సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని నిలదీశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును దాదాపు ఐదున్నర మీటర్ల మేర పెంచి 18 అడుగుల మేర గేట్ల నిర్మాణం చేస్తుంటే సీఎం మొద్దునిద్రతో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

* సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. కళాకారుడికి పవన్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ఆమె ట్వీట్‌ చేశారు.

* భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర 100 కి.మీ. పూర్తి అయింది. దీంతో వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ వంద కిలోల కేక్‌ కట్‌ చేశారు. గత నెల 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

* మండపాల్లో వినాయకచవితి ఉత్సవాలకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భాజపా శ్రేణులు ఆందోళనలకు దిగాయి. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప తదితర చోట్ల కలెక్టరేట్లు, సబ్‌కలెక్టరేట్ల ముట్టడికి శ్రేణులు యత్నించాయి. విశాఖలో భాజపా నేతలు గణేశుడి విగ్రహాన్ని తలపై పెట్టుకుని కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, విశ్వహిందూ పరిషత్ నేతలు పాల్గొన్నారు. వినాయక మండపాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని.. అనుమతించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.