Politics

జైల్లోనే ఆర్యన్. కొత్త పథకం అంటున్న కేసీఆర్-తాజావార్తలు

జైల్లోనే ఆర్యన్. కొత్త పథకం అంటున్న కేసీఆర్-తాజావార్తలు

* భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్‌ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబ‌ర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ జర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్‌-పాక్ జ‌ట్లు ఎదురుపడనున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇరు జట్లు ఆరు సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు టీమ్‌ఇండియా విజ‌యం సాధించింది. ఒక మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్‌ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్కు ఇస్తామ‌ని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ ర‌మీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్‌ చెక్‌ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

* ‘నరేశ్‌ తవ్విన గుంతలో మోహన్‌బాబు కుటుంబం పడిపోయింది’ అని జీవితారాజశేఖర్‌ అన్నారు. అక్టోబరు 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఆమె జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవిత మరోసారి ప్రెస్‌మీట్‌లో పాల్గొని, మాట్లాడారు.

* బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అతడికి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. డ్రగ్స్‌ ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన ఆర్యన్‌తో పాటు ఎనిమిది మందికి నిన్న న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఆర్యన్‌ తరఫు న్యాయవాది నిన్న మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ రోజు నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మెర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచలకు బెయిల్‌ తిరస్కరించారు. ఈ ముగ్గురూ బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు.

* ‘‘రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. తెరాస వచ్చాక అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సంక్షేమంతో పాటు మూలధన పెట్టుబడులూ పెంచుతున్నామని పేర్కొన్నారు. అన్ని మతాలను గౌరవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ అభిమతమని.. అందుకే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంతో చేశామని చెప్పుకొనే గత ప్రభుత్వాలు బోనాల పండుగను ఎనాడైనా పట్టించుకున్నాయా? అని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం బోనాల పండగకు రూ.15 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. యాదాద్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

* రాజధాని రైతులకు కౌలు బకాయిలు నాలుగు వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2021 వార్షిక కౌలు చెల్లించకపోవడంపై రాజధాని రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కౌలు సకాలంలో చెల్లించని కారణంగా రైతులు కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్ని సార్లు చెప్పినా కౌలు సకాలంలో ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లోగా కౌలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

* ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. క్రికెట్‌తోపాటు క్యాసినో ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.53 లక్షల నగదు, బ్యాంక్‌ అకౌంట్‌లోని రూ.21లక్షలు ఫ్రీజ్‌ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ తిరుమలగిరికి చెందిన ప్రధాన నిందితుడు కిరణ్‌ 2003లో యూకే, శ్రీలంకలో ఉద్యోగం చేసి అక్కడే ఉండి గ్యాంబ్లింగ్‌ ఎలా చేయాలో నేర్చుకున్నట్టు విచారణలో తేలిందని తెలిపారు. నేపాల్‌కు చెందిన నలుగురు మహిళలను ఉద్యోగులుగా పెట్టుకుని గత మూడేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు సీపీ తెలిపారు. బెట్టింగ్‌లో నగదు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ప్రచారం చేసి 40మందిని మోసం చేసినట్టుగా గుర్తించారు. బెట్టింగ్‌ ముఠా బాధితులు వెయ్యిమంది వరకు ఉంటారని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

* సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. రైలు పట్టాలపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్థానికులు గుర్తించి వికారాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా లేక, వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు 30ఏళ్ల యువకుడు, మరొకరు 60ఏళ్ల వృద్ధుడు అని వికారాబాద్‌ రైల్వే ఇన్‌ఛార్జి ఎస్సై మల్లేష్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

* విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏపీలో విద్యార్థుల కదంతొక్కారు. తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ఎయిడెడ్‌ కళాశాలల ప్రైవేటీకరణ, ఉపకార వేతనాల మంజూరు సమస్యలపై నిరసనలు చేపట్టారు. నిరసన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బారికేడ్లు తోసుకుని కొందరు కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు పక్కకు లాగి పడేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. జిల్లా కలెక్టర్‌ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలంటూ నినాదాలు చేశారు. విజయనగరం, గుంటూరులోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

* త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసేందుకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు హుజూరాబాద్‌ చేరుకున్నారు. నామినేషన్‌ పత్రాలతో ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్న తమను నామినేషన్‌ వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు నినాదాలు చేశారు.

* టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా నీరజ్‌కు, దేశానికి పసిడి పతకాన్ని అందించిన ఆ ఈటెను వేలానికి పెట్టగా.. రూ.కోటిన్నర ధర పలికింది. ఇక రెండు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన భారత తొలి మహిళగా నిలిచిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ.80,00,100 ధర లభించింది.