ScienceAndTech

ఆవాల మొక్కల నుండి విమాన ఇంధనం

ఆవాల మొక్కల నుండి విమాన ఇంధనం

విమానయానరంగానికి ఇంధన ఖర్చులు పెను భారంగా మారుతున్న వేళ భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసిన నూనె నుంచి విమాన ఇంధనం తయారుచేయవచ్చని పేర్కొంది. దీంతో ఇంధన ఖర్చులు తగ్గడంతోపాటు విమాన ఇంధనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను 68శాతం తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు జీసీబీ బయోఎనర్జీ జర్నల్‌లో ప్రచురితమైమయ్యాయి.

‘‘అమెరికా వ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 2.5శాతం విమానయాన రంగానిదే. గ్లోబల్‌ వార్మింగ్‌లో దీని పాత్ర 3.5శాతంగా ఉంది. కేరినాటా రకానికి చెందిన ఆవాల మొక్కలతో తయారు చేసే విమాన ఇంధనం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఆవాల మొక్కతో లీటర్‌ ఇంధనం ఉత్పత్తి చేయడానికి కేవలం 0.12 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది చమురు ఇంధనంతో పోలిస్తే చాలా తక్కువ. ఈ ఇంధనం ఉత్పత్తికి అవసరమయ్యే ముడిసరుకులు, ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే.. ఈ ఎకో ఇంధనాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తాం’’ అని యూఎస్‌లోని జార్జియా యూనివర్సిటీలో వార్నెల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్‌ న్యాచురల్‌ రీసోర్సెస్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న పునీత్‌ ద్వివేది తెలిపారు.

అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌.. 15 మిలియన్‌ డాలర్లతో ‘సౌత్‌ఈస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రిన్యూవబుల్స్‌ ఫ్రమ్‌ కేరినాటా’అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో పునీత్‌ ద్వివేది కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా యూఎస్‌ ఆగ్నేయ అమెరికాలో కేరినాటా రకం ఆవాల మొక్కలను పెద్ద మొత్తంలో ఏ విధంగా పెంచాలి, వాటి నుంచి నూనె ఎలా సేకరించాలనే విషయంపై పరిశోధలు చేస్తున్నారు.