NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం-తితిదే ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

సింగపూర్ తెలుగు సమాజం-తితిదే ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పి.జి. కళాశాల తెలుగు విభాగము, మలేషియా తెలుగు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే అంశంపై అక్టోబర్ 20న అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఇండోనేషియా నుండి వాల్మీకి రామాయణ ఉపాసకులు రామాయణ హరినాథరెడ్డి సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే అంశంపై ప్రసంగించారు. తితిదే ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వాల్మీకి రామాయణం మానవాళికి మార్గనిర్దేశనం అని త్రేతాయుగం నాటి రామాయణాన్ని నేడు ప్రతి ఒక్కరూ అనుసరించేలా మహర్షి వాల్మీకి రచించారని తెలిపారు. విశిష్ట అతిధిగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్.చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. సింగపూర్ తెలుగు సంఘం అధ్యక్షుడు కోటిరెడ్డి వాల్మీకీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బలమైన కుటుంబ వ్యవస్థకు రామాయణం తార్కాణం అన్నారు. ఇలాంటి భక్తి సంబంధ కార్యక్రమాలద్వారా అందరిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందన్నారు. ఈ సదస్సులో సుమారు 20 దేశాల నుండి పాల్గొన్నారని, యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా పెద్దసంఖ్యలో ప్రవాసులు వీక్షించారని కార్యక్రమ నిర్వాహకులు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అంతర్జాతీయ ప్రశంసా పత్రాన్ని అందిస్తామని తెలిపారు. సభాద్యక్షురాలుగా డా।।మహదేవమ్మ, పర్యవేక్షకురాలుగా డా।।కృష్ణవేణి వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో మలేషియా తెలుగు సంఘము అధ్యక్షులు డా. వెంకట ప్రతాప్, ఉపాధ్యక్షులు సూర్య నారాయణ, మేడూరి మాధవకృష్ణ శర్మ (అమెరికా), మల్లికేశ్వరరావు (ఆస్ట్రేలియా), సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల తదితరులు పాల్గొన్నారు.