DailyDose

ఆరేళ్ల గిరిజన బాలికపై తెరాస నేతల అఘాయిత్యం-నేరవార్తలు

ఆరేళ్ల గిరిజన బాలికపై తెరాస నేతల అఘాయిత్యం-నేరవార్తలు

* నూజివీడు ట్రిపుల్ ఐటీ రోడ్డులో లీకైనా మెగా గ్యాస్ పైపు లైన్, నీటి కుంటలో ఎగజిమ్ముతున్న గ్యాస్ ఉదృతి.

* ఆరేళ్ల గిరిజన బాలికపై ఓ గ్రామ సర్పంచి భర్త, అధికార పార్టీ నేత లైంగికదాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం ఘటన జరిగింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం… మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామ సర్పంచి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ రెండు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంటాడు. వీరికి ఓ కుమార్తె(6), ఓ కుమారుడు. రెండో తరగతి చదువుతున్న బాలిక గురువారం బడికి వెళ్లలేదు. చిన్నారి తల్లి విధులకు వెళ్తూ బాలికను సర్పంచి ఇంట్లో వదిలివెళ్లారు. సర్పంచి భర్త ఇంట్లో ఎవరూలేని సమయంలో చాక్లెట్‌ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ.. కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆరా తీశారు. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారమిచ్చారు. అనంతరం ఇద్దరూ ఈ విషయమై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నిలదీశారు. ఆయన తప్పు అంగీకరించకపోగా, వారిని వాళ్ల ఇంట్లోనే బంధించి ఇంటికి తాళం వేశాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని తాళాలు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి పారిపోయేందుకు యత్నించిన నిందితుని కారుపై దాడిచేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

* సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టుబడింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన రైల్వే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశా, ముంబయికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు.

* బావిలో దూకి తల్లి, ఇద్దరు కుమారులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కడప జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. చిన్నమండెం మండలం మల్లూరు గ్రామం వద్ద ఇద్దరు కుమారులను దిగుడు బావిలోకి తోసేసి, అనంతరం తల్లి కూడా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. గ్రామస్థులు ముగ్గురి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* అక్రమంగా గంజాయి అమ్మి సొమ్ముచేసుకునే వారి ఆస్తులన్నీ జప్తుచేస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. నిషేధిత గంజాయి ఉత్పత్తులను అమ్మి సమాజాన్ని నాశనం చేస్తున్న వారిపై సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం ఎన్డీపీఎస్‌ సెక్షన్‌ 86ఈ అండ్‌ ఎఫ్‌ ఆధారంగా కఠినచర్యలు తీసుకోనున్నామన్నారు. శుక్రవారం నాగోలులోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలోనూ అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలో 2106 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టుచేసి రూ.కోట్లు విలువచేసే అతని ఆస్తినంతా జప్తుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఓ ట్రాన్స్‌పోర్టు వాహనంలో 110 కిలోల గంజాయిని రవాణాచేస్తూ ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల వివరాలు సీపీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం… రాజస్థాన్‌కు చెందిన లుంబారామ్‌ సోలంకి(24) 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. అయిదేళ్ల క్రితం మినీ ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని కొనుగోలు చేసి కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు గుట్కా ప్యాకెట్లను రవాణా చేశాడు. ఏడాదిన్నర క్రితం కూకట్‌పల్లిలో ఉండే రాజస్థాన్‌కే చెందిన మంగీలాల్‌కు వాహనాన్ని విక్రయించాడు. పూర్తి సొమ్ము చెల్లించకపోవడంతో మంగీలాల్‌ పేరిట ఆ వాహనాన్ని రిజిస్టర్‌ చేయలేదు. సొమ్ము వసూలు కోసం వెళ్లిన లుంబారామ్‌కు గంజాయి కేసులో మంగీలాల్‌ అరెస్టు అయిన విషయం తెలిసింది. జైల్లో ఉన్న మంగీలాల్‌ను కలిసిన లుంబారామ్‌కు గంజాయి స్మగ్లర్ల వివరాలూ తెలిశాయి. తానూ సులువుగా సంపాదించేందుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నం వెళ్లాడు. అక్కడ గంజాయి సప్లయర్‌ మసాద పెద్దబాలన్న(32) వద్ద 10 కిలోల గంజాయిని కొని ఆర్టీసీ బస్సులో మహారాష్ట్రకు తరలించి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రషీద్‌(31)కు అందజేసి రెండింతల లాభాన్ని ఆర్జించేవాడు. మూడు నెలలుగా గుట్టుగా తరలిస్తున్న లుంబారామ్‌కు ఒకేసారి పెద్దమొత్తంలో సంపాదించాలనే ఆశపుట్టింది. దీంతో షాబాద్‌లో ఉండే రాజస్థాన్‌కే చెందిన కిష్ణారామ్‌తో కలిసి పథకం వేశాడు. ఇద్దరూ ఈ నెల 18న నర్సీపట్నం వెళ్లారు. పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో 28వ తేదీ వరకు అక్కడే మకాం వేశారు. 28న అర్ధరాత్రి అడవిలోకి వెళ్లి పెద్దబాలన్న సాయంతో 110కిలోల గంజాయితో నాగపూర్‌కు బయలుదేరారు. శుక్రవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసరాల్లోకి చేరుకోగానే ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిందితులను పట్టుకొన్నారు.

* అతడో పాకిస్థానీ.. పేరు మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌. సందర్శకుల వీసా మీద దుబాయ్‌లో కచేరీలు చేస్తుంటాడు. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో నివసించే ఓ యువతి కూడా దేశవిదేశాల్లో పాటలు పాడుతుంటారు. తొమ్మిదేళ్ల క్రితం ఇక్రమ్‌ ఆమెకు దుబాయ్‌లో పరిచయమయ్యాడు. తాను దిల్లీకి చెందిన ముస్లింగా పరిచయం చేసుకున్న అతడు పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించగా.. ఆమె అంగీకరించారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకున్న నెల రోజుల్లోనే అతనూ ఇక్కడికి వచ్చాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం ఆమె ఇస్లాం మతంలోకి మారింది. చాదర్‌ఘాట్‌లో కాపురం పెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆమె దిల్లీలోని అత్తారింటికి వెళ్దామని అడిగింది. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. తాను పాకిస్థాన్‌వాసినని, సందర్శకుల వీసాతో వచ్చానని చెప్పాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పట్నుంచి తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. భర్తతో భయంభయంగానే కలిసి జీవిస్తోంది ఆమె. వారికి ఓ కుమార్తె జన్మించింది. చాదర్‌ఘాట్‌లోనే నివసించే నిజాం ఖాజా ద్వారా ఆధార్‌ కార్డు, వరంగల్‌లో ఉంటున్న అతడి స్నేహితుడి ద్వారా పది, ఇంటర్‌ ధ్రువపత్రాలను సమకూర్చుకున్నాడు. వాటిని ముంబయిలో రాష్ట్రీయ విద్యాపీఠ్‌ పేరుతో నకిలీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రమేష్‌ మూలేకి పంపి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ పట్టాను రూ. 10 వేలకు కొన్నాడు. అవే నకిలీ పత్రాలతో ఏడేళ్ల కిందట భారత పాస్‌పోర్టు తీసుకున్నాడు.