NRI-NRT

అంబానీకి గండం. ప్రశ్నలు ఆపనంటున్న కేసీఆర్. ప్రవాసులకు శుభవార్త-తాజావార్తలు

అంబానీకి గండం. ప్రశ్నలు ఆపనంటున్న కేసీఆర్. ప్రవాసులకు శుభవార్త-తాజావార్తలు

* ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద మరోసారి కలకలం రేగింది. ముకేశ్‌ అంబానీ ఇంటి గురించి గుర్తు తెలియని ఓ ఇద్దరు వ్యక్తులు ఆరా తీశారంటూ పోలీసులకు సమాచారం అందడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం గుర్తించిన కొన్ని నెలలు తిరగక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

* అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వడ్లు కేంద్రం కొంటుందా? కొనదా? సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏడాదిగా దిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్‌.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..? భాజపానే నియమించిన గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆ పార్టీకి చెందిన వరుణ్‌ గాంధీ కూడా రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..? కేసీఆర్‌ చైనాలో డబ్బులు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు. ‘‘పంజాబ్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనిపై సమాధానం చెప్పేదాకా.. కేంద్రాన్ని, భాజపాను వదిలిపెట్టం. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమే. రాయలసీమకు నీరు ఇవ్వాలని ఈ రోజు కూడా చెబుతున్నా. ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించుకొని మరీ రాయలసీమకు నీళ్లివ్వాలని చెప్పా. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా? బండి సంజయ్‌ యాసంగిలో వడ్లు వేయాలని చెప్పిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు ఆరు హెలికాప్టర్లు పెడతా. బండి సంజయ్‌, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రావాలి. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడ అని బండి సంజయ్‌ ప్రశ్నిస్తున్నారు. అసలు ఉద్యమంలో ఆయనెక్కడ ఉన్నారు? ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు నీ పేరైనా తెలుసా?. భాజపా నేతల కథ తేల్చేదాకా నేను రోజూ మాట్లాడతా. ఇకపై రోజూ కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే దేశద్రోహులమా?’’ అని కేసీఆర్‌ అన్నారు.

* కొవిడ్‌ టీకా స్పుత్నిక్‌-వి, స్పుత్నిక్‌-లైట్‌ టీకాల తయారీకి ముంబయికి చెందిన ఫార్మా సంస్థ వొకార్డిట్‌తో రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) భాగస్వామ్య ఒప్పందం చేసుకొంది. ఈ మేరకు ఆర్‌డీఐఎఫ్‌ పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తున్న ఈఎన్‌ఎస్‌వో హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని వొకార్డిట్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

* అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ఆ దేశానికి భారతీయులు తరలివెళ్తున్నారు. సోమవారం నుంచి అమెరికా-భారత్​ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అగ్రరాజ్యం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంక్షల కారణంగా భారత్​లో చిక్కుకున్న ప్రవాసులు ప్రస్తుతం తిరుగు ప్రయాణమవుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం తమకు ఉపశమనం కలిగించిందని వారు పేర్కొంటున్నారు.

* అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. రెండు కీలక అంశాలపై కొత్త వివాదానికి భాజపా, తెదేపా తెర లేపాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్, కరెంటు.. ఈ మూడు అంశాలపై రెండు పార్టీలూ వివాదాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కడా పెరగలేదని.. అయినప్పటీకీ కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని విమర్శించారు. ధరలు పెంచి సెస్‌ల రూపంలో రూ.3.35 లక్షల కోట్లు పన్నులను వసూలు చేస్తున్న కేంద్రం.. నిబంధనల మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎగ్గొడుతోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

* తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పన్నులు తగ్గించినా ఏపీ మొండిచేయి చూపించిందని చంద్రబాబు తప్పుబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని మండిపడ్డారు. అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతిందని.. ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు. లారీల యాజమాన్యాలు, కార్మికులు దెబ్బతినడమే కాక.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారస్థాయికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

* రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా, తెరాస నాటకాలాడుతున్నాయని.. వీరి ఆటలో ప్రజలు పావులు కావొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వరి పండించొద్దని, పండిస్తే కొనమని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పండిన ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో ప్రణాళికలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పంట మార్పిడిపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనేకసార్లు దిల్లీ వెళ్లినా.. నదీజలాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.

* నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులతో అమర్యాదగా మాట్లాడటం సరి కాదని, అందువల్ల గొప్పతనం పెరిగిపోదంటూ ఓ పోలీస్ అధికారి గువ్వలకు సూచించారు. పోలీసులతో గువ్వల బాలరాజు అమర్యాదగా మాట్లాడటంతో అక్కడున్న వారు అలా స్పందించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని బూత్‌పూర్ రోడ్డులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశదిన కర్మకు గువ్వల బాలరాజు హాజరైన సందర్భంలో ఈ వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వీడియోలో ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది.

* రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. మెదక్‌ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు.

* రాష్ట్రానికి ఎక్సైజ్‌ ద్వారానే ఆదాయం వస్తుందని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నంత సులభంగా రాష్ట్రం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. పెట్రో ధరలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు.. కేంద్రానికి ఉండేవి వేరని.. ఇప్పటికే పెంచిన పన్నును కొంతమేర తగ్గించినట్లు పేర్కొన్నారు.

* సీఎం కేసీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అబద్ధాల కోసమే ప్లీనరీలు, బహిరంగ సభలు, మంత్రి వర్గ సమావేశాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఏం చేశారో కేసీఆర్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ నిన్న మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా తీరును ఎండగట్టిన నేపథ్యంలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే రూ.130కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ.. అక్కడి అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) సోమవారం స్పష్టం చేసింది. అంతేగాక, ఇకపై పాల ధరను కూడా లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరి ఘటన విచారణలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము ఆశించిన రీతిలో విచారణ లేదని వ్యాఖ్యానించింది. రెండు ఎఫ్ఐఆర్‌లను కలిపి విచారించడాన్ని చూస్తుంటే.. నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా స్పందించింది.

* అమెరికా విమాన వాహక నౌకలు, ఇతర నావికాదళ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా సైన్యం సాధాన చేస్తోంది. ఇందు కోసం షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎడారిలో అచ్చం అమెరికా విమాన వాహక నౌకల వంటి నిర్మాణాలను చేపట్టింది. ఈ విషయం మాక్సర్‌ అనే సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. తమ యాంటీ క్యారియర్‌ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చైనా ఇలా చేస్తోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.