Health

ఒమిక్రాన్ పేరు వెనుక కథ ఇది

ఒమిక్రాన్ పేరు వెనుక కథ ఇది

దక్షిణాఫ్రికాలోని వెలుగుచూసిన కోవిడ్‌–19 కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ (బి.1.1.529) ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా కంటే శరవేగంగా విస్తరించే ఈ వేరియెంట్‌ ఒకటి వెలుగులోకి వచ్చిందని తెలుసుకునే లోపే ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా విస్తరించిందనే అనుమానాలున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా డెల్టా కంటే 40శాతం అధికంగా ఒమిక్రాన్‌ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ పేరు ఎలా వచ్చింది?
కరోనా వైరస్‌లో కొత్త రకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లనే పెడుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ వరసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ హఠాత్తుగా కొన్ని అక్షరాలను వదిలేసి ఒమిక్రాన్‌ని ఎంపిక చేసుకుంది. వాస్తవానికి లాంబ్డా తర్వాత ‘‘న్యూ’’ అక్షరం రావాలి. ఆ తర్వాత గ్రీకు వర్ణమాల ప్రకారం ‘‘XI’’ వస్తుంది. న్యూ అంటే ఆంగ్లంలో కొత్త అనే అర్థం ఉంది కాబట్టి గందరగోళానికి తావు లేకుండా దానిని విడిచిపెడితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరులో xi (షి జిన్‌పింగ్‌) ఉండడంతో దానిని కూడా డబ్ల్యూహెచ్‌ఓ విడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని వదిలేసి గ్రీకు వర్ణమాలలోని పదిహేనో అక్షరమైన ‘ఒమిక్రాన్‌’గా కొత్త వేరియెంట్‌కు నామకరణం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన కరోనా వేరియెంట్లు..
ఆల్ఫా: యూకేలోని కెంట్‌లో తొలిసారిగా 2020 సెప్టెంబర్‌లో గుర్తించారు. బ్రిటన్‌లో సెకండ్‌వేవ్‌ ఈ వేరియెంట్‌తోనే విజృంభించింది.
బీటా: దక్షిణాఫ్రికాలో 2020 మేలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50 శాతం కేసుల్ని ఈ వేరియెంట్‌ పెంచింది.
గామా: బ్రెజిల్‌లో నవంబర్‌ 2020లో గుర్తించారు. దక్షిణ అమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది
డెల్టా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో ఈ వైరస్‌ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆసియా, యూరప్‌లో విజృంభించింది. ఇప్పటివరకు వచ్చిన వేరియెంట్‌లలో ఇదే అత్యంత వేగంగా విస్తరించింది. ఆల్ఫా కంటే 60% వేగంగా వ్యాప్తి చెందింది.
ఈటా: డిసెంబర్‌ 2020లో యూకేలో తొలిసారిగా బయటపడిన ఈ రకం 72 దేశాలకు విస్తరించింది.
లోటా: న్యూయార్క్‌లో 2020లో బయటపడిన ఈ వేరియెంట్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు
కప్పా: భారత్‌లో అక్టోబర్‌ 2020లో వెలుగు చూసిన కప్పా వేరియెంట్‌ కేసులు 55 దేశాల్లో వెలుగులోకి వచ్చాయి.
లాంబ్డా: డిసెంబర్‌ 2020లో పెరూలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియెంట్‌ మూడు నెలల్లోనే 41 దేశాలకు విస్తరించింది.