Devotional

TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి – 07/01/2022

TNILIVE Default Featured Image

ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
07-01-22 శుక్రవారం
నిన్న 6-01-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 32,613
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 15,639
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.45 కోట్లు …
సర్వేజనాః సుఖినోభవంతు

1. పది రోజుల పాటు వేంకటేశుడి వైకుంఠ ద్వార దర్శనం
*ఈ నెల 13 నుంచి 22 వరకు వీఐపీల సిఫారసు లేఖల రద్దు
*13న మాడవీధులలో స్వర్ణరథంపై మలయప్ప స్వామి దర్శనం
ఈ నెల 13 నుంచి 22 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా గతేడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందించాలని నిర్ణయించింది. సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. చైర్మన్‌ కార్యాలయంలో కూడా ఈ పది రోజులూ సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు.
**ఆ రోజుల్లో గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ రద్దు
జనవరి 11–14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను రద్దు చేసి, వాటిని కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది. ఈ తేదీలలో ఎంబీసీ–34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ, ఏఆర్‌పీ కౌంటర్లలో గదులు కేటాయించబడవు. జనవరి 11–14 వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్‌ను రద్దు చేశారు. సామాన్య భక్తులకు తిరుమలలో 6 ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్‌ కౌంటర్ల ద్వారా గదులను కేటాయిస్తారు.

2. 11న శ్రీవారి ఆలయంలో ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో 11వ తేదీన (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) జరుగనుంది. 13న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో 11వ తేదీన ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసి తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు. ఆ రోజున బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు.

3. ట్రస్టులకు రూ.1.50 కోట్ల విరాళాలు
తిరుమల శ్రీవారి ట్రస్టులకు గురువారం రూ.1.50 కోట్లు విరాళంగా అందాయి. శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఝాన్సీ లక్ష్మీబాయి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్‌ ట్రస్టుకు రూ.25 లక్షలు, ఎస్వీ సర్వశ్రేయస్సు ట్రస్టుకు రూ.25 లక్షలు అందజేశారు.హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ విద్యార్థి శ్రీసాయి విశ్వనాథ్‌ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు అందజేశారు.ఈ విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం ఉదయం ఆలయంలోని రంగనాయక మండపంలో డిప్యూటీఈవో రమే్‌షబాబుకు దాతలు అందజేశారు.

4.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని గురువారం 32,613 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 15,639 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

5. తితిదే శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ విద్యార్థి రాయవరపు సాయి విశ్వనాథ్‌ రూ.50 లక్షలు విరాళంగా అందించారు. గురువారం ఉదయం విరాళం డీడీని తితిదే శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబుకు అందజేశారు.

6. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి నిరాకరణ
భద్రాచలం రాములోరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆన్‌లైన్‌లో అమ్మిన టికెట్ల డబ్బులు భక్తులకు తిరిగి చెల్లించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది. వేదపండితులు, అర్చుకుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

7.షిర్డీ ఆలయానికి భారీ విరాళాలు.. రూ.6.68 కోట్ల ఆదాయం
వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్‌కు కానుకలు రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్‌ పదాధికారులు బుధవారం లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్‌లైన్‌లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.
**లాక్‌డౌన్‌తో భారీగా పడిపోయిన ఆదాయం..
క్రిస్మస్‌తోపాటు థర్టీఫస్ట్‌ డిసెంబర్, నూతన సంవత్సరం ఇలా వరుసగా వచ్చిన సెలవుల కారణంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్‌ ఆంక్షలు, ఆలయ దర్శన వేళలు కుదించినప్పటికీ పది రోజుల్లో భక్తులు పెద్దసంఖ్యలోనే బాబాను దర్శించుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల అనేక నెలలు షిర్డీసాయి ఆలయం మూసి ఉంచారు. దీంతో బాబా ఆలయానికి కానుకల రూపంలో లభించే ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా వైరస్‌ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచారు.దీంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. కానీ కోవిడ్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తొలుత రోజుకు 12 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అనుమతి నిషేధించారు. కానీ ఈ సంఖ్య పెంచాలని బాబా ఆలయ సంస్ధాన్‌పై భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో పెరుగుతున్న భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతించసాగారు. దీంతో హుండీలో భక్తులు సమర్పించుకుంటున్న కానుకలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా వచ్చిన సెలవుల వల్ల నవంబర్‌ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు భక్తులు బాబాకు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఇలా పది రోజుల్లో మొత్తం రూ.6.68 కోట్ల మేర విరాళాలు సమకూరాయని ఆలయ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు ఆదాయంతో పోలిస్తే ఈ విరాళాలు తక్కువే అని చెప్పారు. ఒక పక్క కోవిడ్‌ ఆంక్షలు, దర్శన వేళలు కుదించడం, మరోపక్క రోడ్డు, రైలు రవాణ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో షిర్డీకి వచ్చే భక్తుల తాకిడి సగానికి తగ్గిపోయింది. గతంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాబాకు కానుకల రూపంలో సుమారు రూ.10–12 కోట్లమేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు సగానికి పడిపోయిందని వారు అంటున్నారు.

8. శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.కాగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న వెల్లడించారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు.