Devotional

త‌నివి తీర‌ని ‘త‌మిళ’ తీర అందాలు

త‌నివి తీర‌ని ‘త‌మిళ’ తీర అందాలు

*మిళనాడు ఒక అద్భుతమైనది
* పర్యాటక ప్రాంతంగా పేరెన్నికగన్నది.

**బంగాళాఖాతం తీరం వెంట ఉన్న మనస్సునుమైమరపింపజేసే అద్భుతమైన బీచ్‌లు, ఊటీ వంటి పలు పర్వత ప్రాంత పట్టణాలు (హిల్‌ స్టేషన్లు), ప్రాచీన ఆలయాలు, కన్యాకుమారిలోని వివేకానందుడి రాక్‌ మెమోరియల్‌, వన్యప్రాణుల అభయారణ్యాలు, మహాబలిపురం శిల్ప సంపద మొదలైనవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

తమిళనాడులోని ప్రాచీన కట్టడాలు గతకాలపు చారిత్రక వైభవాన్ని చాటుతుంటాయి. సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యానికి సాక్ష్యంగా నిలుస్తుంటాయి. చెన్నైలోని మెరీనా బీచ్‌ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సుందరమైనదిగా పేరొందింది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు జరిగిన దండి మార్చ్‌ కోసం సి. రాజగోపాలా చారి తమిళనాడులోని వేదారణ్యం నుంచి పాదయాత్ర ఆరంభించారు. ప్రాచీన, అర్వాచీన సంస్కృతీ సంప్రదాయాలకు నెలవుగా తమిళనాడు భాసిల్లుతోంది. తమిళనాడులో ఆశ్చర్యం కలిగించే ప్రాచీన కట్టడాలు అనేకం ఉన్నాయి.
hill-stations
హిల్‌ స్టేషన్లు :
తమిళనాడులోని హిల్‌స్టేషన్లు అన్నీ సాహసకార్యాల పట్ల అభిరుచి ఉన్నవారికి ఎంతో ఉత్సాహభరితంగా ఉంటాయి. ఈ హిల్‌ స్టేషన్లపైకి వెళ్లినప్పుడు మనల్ని స్పృశిస్తూ, పలుకరిస్తూ వెళ్లే మేఘాలు, అందమైన ప్రకృతి, శరీరం జలదరించే శబ్దాలతో జాలువారే జలపాతాలు, మంచుతో కప్పబడిన లోయలతో పలు హిల్‌ స్టేషన్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ooty
ఊటీ :
అనేకమందికి వేసవి విడిది ఊటీ. ఉదగమండలం అనే పేరుతో కూడా ఊటీని వ్యవహరిస్తుంటారు. తమిళనాడులో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఊటీ ‘క్వీన్‌ ఆఫ్‌ హిల్‌స్టేషన్స్‌’గా పేరొందింది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలు మనలను మరొక లోకంలోకి తీసుకువెళతాయి. తమిళనాడును సందర్శించాలనుకునే పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఊటీ.
yelagiriu
ఎళగిరి :
సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉత్సాహవంతులకు అద్భుతమైన ప్రదేశం ఎళగిరి హిల్‌ స్టేషన్‌. స్నేహితులతో కలిసి సరదాగా గడిపి నూతనోత్తేజాన్ని పొందాలనుకునేవారు తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రదేశం ఎళగిరి.
kodaikenal
కొడైకెనాల్‌ :
తమిళనాడులోని మరొక ప్రముఖ హిల్‌స్టేషన్‌ కొడైకెనాల్‌. సముద్ర మట్టానికి సుమారు 2100 మీటర్ల ఎత్తులో ఉండే ఈ హిల్‌స్టేషన్‌ ఆహ్లాదకర అనుభూతులను కలిగిస్తుంది.
WAR1
స్మారకచిహ్నాలు :
ప్రాచీన చరిత్రకు ప్రతిరూపాలుగా నిలిచిన అనేక కట్టడాలు తమిళనాడులో కనువిందు చేస్తుంటాయి. మహాబలిపురం, భారతీయార్‌ ఇళ్లం, మద్రాస్‌ వార్‌ సెమెట్రీ, వివేకానంద ఇళ్లం, రిప్పన్‌ బిల్డింగ్‌ మొదలైన విశిష్టప్రదేశాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.
mahabalipuram
మహాబలిపురం :
మహాబలిపురం కాంచీపురం జిల్లాలో ఉంది. దీనిని మామళ్లపురం అని కూడా అంటారు. చెన్నై నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం ప్రాచీన చారిత్రక నగరం. దక్షిణ ప్రాచ్య దేశాలకు వాణిజ్యం కోసం వెళ్లిన ప్రాచీన భారత వర్తకులు మహాబలిపురం సముద్రతీరం నుంచే రాకపోకలు సాగించారు. ఏడవ శతాబ్దంలో పల్లవులు దీనిని పాలించారు. ఇక్కడ శిలలపై చెక్కిన అపురూపమైన శిల్పాలనేకం కనువిందు చేస్తుంటాయి. మహాబలిపురాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.
WAR
వార్‌ సెమెట్రీ :
మద్రాస్‌ వార్‌ సెమెట్రీ చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో, విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశంలో మద్రాస్‌ 1914-1918 స్మారకాన్ని నిర్మించారు. దీనిమీద మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన సుమారు వెయ్యిమంది పేర్లను మనం చూడవచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు.
vivekananda
వివేకానంద రాక్‌ మెమోరియల్‌ :
తమిళనాడును సందర్శించే పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న ప్రదేశం కన్యాకుమారిలోని వవాతురైలో ఉన్న వివేకానంద రాక్‌ మెమోరియల్‌. భూమి నుంచి దూరంగా సముద్రంలో ఉన్న రెండు కొండలలో ఒకదానిపై వివేకానంద రాక్‌ మెమోరియల్‌ను నిర్మించారు. 1892లో వివేకానందుడు కన్యాకుమారి నుంచి ఈ కొండ వరకూ సముద్రంలో ఈదుకుంటూ వచ్చి కొండపై ధ్యానం చేశాడు.
rackfort
రాక్‌ఫోర్ట్‌ ఆలయం :
తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్‌ ఆలయం మొత్తం మూడు ఆలయాల సముదాయం. పర్వత పాదశ్రేణి వద్ద మణిక్క వినాయక ఆలయం, కొండ శిఖరాగ్రాన పిళ్లయార్‌ కోయిల్‌, కొండ మధ్యలో తాయుమానవ కోయిల్‌ (శివస్థలం) ఉన్నాయి.
TANJAVOOR
తంజావూర్‌ :
చోళ రాజుల రాజధానిగా తంజావూర్‌ వాసికెక్కింది. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పాండ్యరాజులు, విజయనగర రాజులు, మదురై నాయకులు, తంజావూర్‌ నాయకులు, తంజావూర్‌ మరాఠాలు పరిపాలించారు. తమిళనాడులోని ముఖ్యమైన యాత్రాస్థలాలలో తంజావూరు ఒకటి. భవన నిర్మాణ కళలో విప్లవాన్ని తీసుకువచ్చిన నిర్మాణం అంటూ ఇక్కడి బృహదీశ్వరాలయాన్ని గురించి చరిత్రకారుడు పెర్సీ బ్రౌన్‌ అభివర్ణించారు. 11వ శతాబ్దంలో రాజ రాజ చోళ నిర్మించిన ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. తిరుచిరాపల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం తంజావూర్‌ చేరడానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. అలాగే పలు ప్రదేశాల నుంచి ఇక్కడకు రైలు మార్గాలున్నాయి. 1674 నుంచి 1855 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన భోన్స్‌లే కుటుంబానికి చెందిన ప్యాలెస్‌ ఇక్కడ ఉంది. ఈ ప్యాలెస్‌ నిర్మాణం చూపరులను అబ్బుర పరుస్తుంది. ఈ ప్యాలెస్‌లో సరస్వతి మహల్‌ గ్రంథాలయం ఉంది. భారతీయ, యూరోపియన్‌ దేశాలకు చెందిన సుమారు 30 వేల ప్రాచీన రాతప్రతులు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.తమిళనాడు పర్యటనలో అడుగడుగున ద్రవిడ సంస్కృతీ సంప్రదాయాలు, ప్రాచీన నాగరికతా విశేషాలు, చారిత్రికాంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.