DailyDose

రేపు ఏపీ కేబినెట్ భేటీ – TNI తాజా వార్తలు

రేపు ఏపీ కేబినెట్ భేటీ – TNI తాజా వార్తలు

*రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అవనుంది. ఈ సందర్భంగా 2022-23 సంవత్సరాలకు గాను సాధారణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

* ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు స్వీట్లు పంచుతూ అభినందనలు తెలుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు నాయకులు సంబరాలలో పాల్గొన్నారు. రాజధాని రైతులు… సోము వీర్రాజును‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

*శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్య సంతాప తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నానని చెప్పారు. ఒంగోలులో రోశయ్య కాంశ్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

*ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనం మీద ఉంచి చిన్న రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లాలోని ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై కొలువుదీర్చి రథంపై ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. అంతకుముందు చంద్రమౌళీశ్వర స్వామి వారి మూల విరాట్ కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

*పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోట అన్నదేవరకుంట చెరువు మట్టి తవ్వకాలలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. చెరువులో ఎమ్మెల్యే వర్గానికి చెందినవారు అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని ఎంపీ వర్గం ఆరోపణలు చేసింది. తవ్వకాలను సర్పంచ్ అనూష అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే వర్గం చెబుతుంది.

*తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాళీకృష్ణ భగవాన్‌(20) అనే యువకుడి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ బుధవారం ఆదేశించింది. అడిషనల్‌ జిల్లా ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ తూర్పు గోదావరి ఎస్పీ, రామచంద్రాపురం డీఎస్పీ, మండపేట సీఐ (ప్రస్తుతం వీఆర్‌), మండపేట స్టేషన్‌ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏప్రిల్‌ 11వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

*బొబ్బిలి పారిశ్రామిక వాడలో గల మైథాన్ కంపెనీ గేటు వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలో జేసీఎల్ వద్ద జరిగిన చర్చల ప్రకారం జీఓ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. కంపెనీలోకి వెళ్లాలనుకొనే మహిళలపై పోలీసులు చేయిచేసుకున్నారు. కార్మికులతో బాహాబాహీకి దిగిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

*విద్యుత్‌ ఛార్జీలను 20 శాతం పెంచేందుకు రాష్ట్ర విద్యుత్‌ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల నిర్ణయం, బోర్డు పర్యవేక్షణ, విద్యుత్‌ బోర్డు, విద్యుత్‌ సంస్థల మధ్య సమస్యలు పరిష్కరించడం వంటి పనులు విద్యుత్‌ క్రమబద్ధీకరణ కమిషన్‌ చేపడుతోంది. బోర్డు విద్యుత్‌ ఛార్జీల వివరాలను ప్రతి ఏటా నవంబరులోగా కమిషన్‌కు సమర్పిస్తోంది. దానిని పరిశీలించిన కమిషన్‌ ఖర్చులు అదనంగా ఉంటే ఛార్జీలు పెంచడం, తక్కువగా ఉంటే ఛార్జీలు తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటుంది. విద్యుత్‌ ఛార్జీలు పెంచే సమయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వాటి ఆధారంగా ఏప్రిల్‌ మొదటి వారంలో కొత్త ఛార్జీలు అమలుచేస్తుంటారు. ఆర్ధిక లోటు కారణంగా 2014లో 15 శాతం ఛార్జీలు పెంచారు. ఆ తర్వాత 2019లో 30 శాతం పెంచేందుకు నిర్ణయించిన కమిషన్‌, ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల కారణంగా నిర్ణయం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ బోర్డు రుణాలు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో, 20 శాతం వరకు ఛార్జీలు పెంచేందుకు అనుమతించాలని విద్యుత్‌ క్రమబద్ధీకరణ కమిషన్‌కు విద్యుత్‌ బోర్డు ప్రతిపాదించింది.

*బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించింది. మెట్రోకు రూ.2,377.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు రూపాయి కూడా మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వాటా కింద రూ.631 కోట్లను చెల్లించాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లుగా బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ ప్రస్తావనే ఉండడం లేదు.

*తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు, దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కమిటీలో నారా లోకేశ్‌, కె.అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్‌బాబు, నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, బీద రవిచంద్రయాదవ్‌, అనగాని సత్యప్రసాద్‌, చింతకాయల విజయ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియమించినట్లు పేర్కొన్నారు

*‘ఈ ముఖ్యమంత్రి మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం.. ఆడబిడ్డలపై రోజుకో అఘాయిత్యం జరిగేలా రాష్ట్రాన్ని తయారు చేసిందుకా? మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచినందుకా?’ అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. సోమవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డికి నిజంగా ధైర్యముంటే, ఆయన నిజంగా మహిళల్ని గౌరవించే వాడైతే పోలీసు పహరాలు, పరదాలు లేకుండా అమరావతి మహిళల మధ్య నుంచి అసెంబ్లీకి వెళ్లాలని సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రికి మహిళా దినోత్సవం నిర్వహించే హక్కు లేదన్నారు. సొంత చెల్లికి, తల్లికి న్యాయం చేసిన తర్వాత జగన్‌రెడ్డి జగన్‌రెడ్డి రాష్ట్రంలోని మహిళల గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. సమావేశంలో మహిళా నేతలు ఆచంట సునీత, అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు.

*వనరుల శాఖ 2017లో చేపట్టిన నీరు-చెట్టు పనులపై శాంపిల్‌ సర్వేలను చేపట్టి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించాలని జిల్లా కలెక్టర్లకు జల వనరుల శాఖ ఆదేశించింది. కోర్టు ఆదేశించినా నీరు-చెట్టు కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ జల వనరుల శాఖను తప్పుబడుతూ రైతులు భారీగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతులకు బిల్లులను చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. అయినా.. బిల్లులు చెల్లించలేదు. దీంతో రైతులు కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11న జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు మొదలు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నీరు-చెట్టు పనులపై గ్రామీణ నీటి సరఫరా విభాగంతో సహా.. ఇతర ఇంజనీరింగ్‌ విభాగాల ఇంజనీరింగ్‌ అధికారులతో ఐదు శాతం వరకు నమూనా సర్వే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్న తరుణంలో,ఇలా జల వనరులేతర శాఖలతో నమూనా సర్వేను చేపట్టి నాణ్యతను పరిశీలించే పనిలో నిమగ్నం కావడం చర్చనీయాంశమైంది.

*నైరుతి బంగాళాఖాతంలో గల అల్పపీడనం సోమవారం పూర్తిగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలపై ఉండదని, వచ్చే 24 గంటల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి

*రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ ఏపీ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం 75వ వార్షికోత్సవ కౌన్సిల్‌ సమావేశాలు విజయవాడ ఐఎం హాల్‌లో ఈనెల 5, 6వ తేదీల్లో జరిగాయి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్‌.సాయి శ్రీనివా్‌స(పశ్చిమగోదావరి), ప్రధాన కార్యదర్శిగా హెచ్‌. తిమ్మన్న (కర్నూలు), ఆర్థిక కార్యదర్శిగా ఎంవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ (కృష్ణా), అసోసియేట్‌ అధ్యక్షులుగా వై.సుబ్రహ్మణ్యం రాజు (కడప), గంటా మోహన్‌ (చిత్తూరు), ఎం.గౌరి ప్రసాద్‌ (కృష్ణా), పీవీఎస్‌ రామారావు (తూర్పుగోదావరి), కె.ఎర్రయ్య (ప్రకాశం), ఎస్‌.చంద్రశేఖర్‌ (కర్నూల్‌), జి.శ్రీనివాస్‌ (పశ్చిమ గోదావరి), ఎస్‌.రామచంద్రయ్య (గుంటూరు), అదనపు ప్రధాన కార్యదర్శులుగా పి.ప్రభాకరరావు (శ్రీకాకుళం), ఎం.శామ్యూల్‌ (పశ్చిమ గోదావరి), సి.నాగరాజు (కర్నూల్‌), కె.చంద్రశేఖర్‌ (అనంతపురం), వీసీ జాకోబ్‌ (తూర్పు గోదావరి), కె.బాలగంగిరెడ్డి (కడప), ఎల్‌వీ రామిరెడ్డి (గుంటూరు), జి.నాగేశ్వరరావు (చిత్తూరు)తోపాటు 16 మంది ఉపాధ్యక్షులు, 16 మంది కార్యదర్శులు, 8 మంది ఆర్ధిక కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సి.రమేశ్‌, పరిశీలకుడిగా ఏఐఎ్‌సటఎఫ్‌ నాయకుడు ఎ.నీలకంఠయ్య వ్యవహరించారు.

*రేపటి(శుక్రవారం) నుంచి జరగాల్సిన ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు దృష్ట్యా షెడ్యూలు మారుతున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డ్ పేర్కొంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ అధికారులందరికీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే కోర్టు ఆదేశాల ప్రకారం షెడ్యూలు ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.