NRI-NRT

అమెరికా లాంటి అగ్ర దేశాలకు ‘అనంత’ ఉత్పత్తులు

అమెరికా లాంటి అగ్ర దేశాలకు ‘అనంత’ ఉత్పత్తులు

అనంతపురం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది కరువు. కానీ అది గతం. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు ఖండాంతరాలకు వెళ్లింది. అమెరికా లాంటి అగ్రదేశాలకు అనంత ఉత్పత్తులు చేరుతున్నాయి. ఉద్యాన పంటల్లోనే ఇప్పటివరకూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన జిల్లా తాజాగా కార్లు, మందులు, రెడీమేడ్‌ గార్మెంట్స్‌ వంటి వాటిలోనూ ముందంజ వేసింది. పారిశ్రామిక ప్రగతికి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎగుమతుల కారణంగా విదేశీ మారకంతో పాటు ఇక్కడ ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. వేలాదిమంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక్కడ తయారై ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల విలువ ఏటా రూ.5 వేల కోట్లకు పైనే ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. గత ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు ఎగుమతి అయిన కియా కార్లు అక్షరాలా 40,440. జిల్లాలో తయారై మన దేశంలో అమ్ముడైన కార్ల సంఖ్య 1,55,678గా ఉంది.

***అమెరికాలో మన కార్లే
అమెరికా వంటి అగ్రదేశంలోనూ మన జిల్లాలో తయారైన ‘కియా’ కార్లు తిరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా, మెక్సికో, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. కార్లే కాదు జిల్లాలోని రాచనాపల్లి వద్ద తయారవుతున్న సిఫ్లాన్‌ డ్రగ్స్‌ (పశువుల మందులు) పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, టర్కీ, ఐర్లాండ్, ఉరుగ్వే, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌ వంటి దేశాలకు వెళుతున్నాయి. జిల్లాలోని పరిగి వద్ద ఇండియన్‌ డిజైన్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తయారు చేసే రెడీమేడ్‌ దుస్తులు యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రమారమి రూ.52.88 కోట్ల విలువైన దుస్తులు ఎగుమతయ్యాయి. హిందూపురం పట్టణ పరిధిలోని తూముకుంట వద్ద ఉన్న విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌ సంస్థ నుంచి పిస్టన్‌ రాడ్స్‌..యూరప్‌తో పాటు ఇజ్రాయిల్‌ తదితర దేశాలకు వెళుతున్నాయి.