NRI-NRT

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 176వ సాహితీ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 176వ సాహితీ సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 176 వ నెల నెలా తెలుగు వెన్నెల మరియు 48 వ టెక్సస్ తెలుగు సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. ప్రముఖ రచయిత శ్రీ సత్యం మందపాటి గారు కూడా అందరికీ నమస్కారాలు తెలుపుతూ కార్యక్రమం వివరాలని అందించారు. చిన్నారులు సాహితీ మరియు సింధూర ప్రయాగ రంగదాస గారి “రాముడుద్భవించాడు” కీర్తన పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి భాగం అయిన సాహిత్య సమాచారంలో డా.Y.కృష్ణ కుమారి భారతంలో క్రీడలు అంశం మీద ప్రసంగించి అందరికీ కొత్త విషయాలు తెలియజేసారు. శాన్ ఆంటోనియోకి చెందిన ప్రసాద్ తుర్లపాటి గారు “అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య: సంకీర్తన పోకడలు-పరిశీలన” మీద ప్రసంగించి వారి కీర్తనలను గుర్తు చేసారు. నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో భాగంగా “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో ఊరిమిండి నరసింహారెడ్డి గారు తెలుగు భాషలోని పొడుపు కథలు, జాతీయాలలో ప్రశ్నలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

డాలస్ కి చెందిన లెనిన్ వేముల గారు “వసంత కాలంపై రాయబడిన కవితలు, గేయాలను” గురించి చక్కగా ప్రసంగించారు. ఆస్టిన్ కి చెందిన ఇర్షాద్ గారు స్టాండ్ అప్ కామెడీ చేసి అందరినీ నవ్వులలో ముంచెత్తారు. హరి మద్దూరి గారు “యుగయుగాల కథ” అంశం మీద ప్రసంగించి సైన్సులో విషయాలను పురాణాలతో పోలుస్తూ అందరినీ ఆశ్చర్యంలో పడేసారు. కార్యక్రమంలో రెండో భాగంలో ప్రముఖ రచయితలు శ్రీ సత్యం మందపాటి, రాము డొక్కా, ఫణి డొక్కా గారి పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. హూస్టన్ కి చెందిన శాయి రాచకొండ గారు, దీప్తి పెండ్యాల గారు, శ్రీనివాస్ పెండ్యాల గారు సత్యం మందపాటి గారి “సత్యాన్వేషణ” పుస్తకానికి ఆవిష్కర్తలుగా వ్యవహరించారు. తరువాత రాము డొక్కా గారి పద్య సఫారి, ఫణి డొక్కా గారి పలుకు కచేరి కలిపిని “మా ఆఫ్రికా యాత్ర” పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకానికి ఆచార్య ఎన్.సీ.ఎచ్.చక్రవర్తి గారు, శ్రీ సత్యం మందపాటి గారు ఆవిష్కర్తలుగా వ్యవహరించారు. చివరగా మాసానికో మహనీయుడు శీర్షిక కింద శ్రీమతి అరుణ జ్యోతి గారు ఈ నెలలో గుర్తు చేసుకోవలసిన ప్రముఖ రచయితల గురించి వివరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు ప్రార్థనా గీతం పాడిన సాహితీ మరియు సింధూరతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.