DailyDose

అయ్యో అన్నమయ్యా..

అయ్యో అన్నమయ్యా..

*తాళ్లపాక అన్నమాచార్యులు నివాసం ఉన్న ప్రాంతం, విగ్రహాలు లేక బోసిపోతున్న మండపం
**తెలుగునాట ప్రతి నోటా అన్నమయ్య పదం పలుకుతోంది. ఆయన వర్ధంతులూ, జయంతులూ వచ్చిపోతూనే ఉన్నాయి. ఘనంగా టీటీడీ ఉత్సవాలు నిర్వహిస్తుంది. కానీ తిరుమల కొండమీద అన్నమయ్య ఒకప్పుడు నివసించిన ప్రాంతం మాత్రం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. వరాహస్వామి ఆలయ వెనుకభాగంలో (పుష్కరిణికి వెళ్లే మార్గానికి ఆనుకుని) తాళ్లపాక అన్నమాచార్యులు నివసించిన ఒక ఇల్లు ఉండేది. మాస్టర్‌ ప్లాన్‌కు అవరోధం అంటూ 2003లో ఆ ప్రాంతంలోని అన్నమయ్య నివాసాన్ని టీటీడీ తొలగించింది. అన్నమయ్య కొలిచిన ఆంజనేయస్వామి రాతి విగ్రహం, అన్నమయ్య విగ్రహం మాత్రం అక్కడే ఒక మండపంలో ఉండేవి. ముఖమండపం, ప్రాకారం నిర్మించి అన్నమయ్య నివాస ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటూ 2007లో అన్నమయ్య వంశస్థులు కోరారు. టీటీడీ అంగీకరించింది. పనులు సాగడం కోసం మండపంలోని విగ్రహాలకు అష్టబంధన బాలాలయం నిర్వహించి తొలగించారు. ఆ విగ్రహాలు అన్నమయ్య వంశస్థుల ఇళ్లలో భద్రపరిచారు. ఆ తర్వాత మరచిపోయారు. విగ్రహాల్లేని మండపం మాత్రమే ఇప్పుడు తిరుమలలో కనిపిస్తోంది. తెలుగువాడైన త్యాగరాజ స్వామికి తమిళనాడులోని తిరువయ్యూరులో ఆయన నివసించిన తావులో గౌరవప్రదమైన నిర్మాణం ఉంది. 32వేల సంకీర్తనలు రాసిన పదకవితా పితామహుడి నివాసం పట్ల మనం చూపించే గౌరవం ఇదేనా అని అన్నమయ్య భక్తులు ఆవేదన చెందుతున్నారు.