Politics

వైసీపీ ఎంపీగా ఆదానీ సతీమణి

వైసీపీ ఎంపీగా ఆదానీ సతీమణి

వైసీపీ ఎంపీలుగా పారిశ్రామిక దిగ్గజాల సన్నిహితులు..కుటుంబ సభ్యులు. వారు వైసీపీనే ఎందుకు ఎంచుకుంటున్నారు. సీఎం జగన్ వారికి ప్రాధాన్యత ఇవ్వటం వెనుక కారణాలు ఏంటి. ఇప్పుడు ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అందులో ఒక స్థానం ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ సాయిరెడ్డికి తిరిగి రెన్యువల్ ఖాయమైంది. ఇక, సీఎం జగన్ కు న్యాయవాదిగా ఉన్న నిరంజన్ రెడ్డి పేరు సైతం ఓకే అవ్వనున్నట్లు తెలుస్తోంది.

*మొన్న అంబానీ – నేడు ఆదానీ..
ఇదే సమయంలో కొంత కాలంగా ప్రచారం సాగుతున్న విధంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం..సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న గౌతమ్ ఆదానీ సతీమణి..ప్రీతి ఆదానీ పేరు సైతం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానీ పేరును సీఎం జగన్ ఎంపిక చేసారు. రిలయన్స్ సంస్థల అధినేత..పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిసారు. ఆ వెంటనే అంబానీ సన్నిహితుడు.. రిలయన్స్‌ సంస్థల వైస్‌ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్‌ ఖరారు అయింది.

*ఆదానీ సతీమణికి సీటు ఖాయమంటూ
ఇక, ఇప్పుడు ఆదానీ సతీమణికి సైతం వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఖాయమైందనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. ఇదే జరిగితే దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా ఉన్న అంబానీ – ఆదానీ సంబంధీకులు వైసీపీ రాజ్యసభ సభ్యులు.. సీఎం జగన్ టీం మెంబర్స్ ఉండనున్నారు. జాతీయ పార్టీలను కాకుండా..వైసీపీ నుంచి వీరు రాజ్యసభకు వెళ్లటం.. వైసీపీనే ఎంచుకోవటం పైన ఆసక్తి కర చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. ఇక, నాలుగో సీటు ఎవరికనేది ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కరంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్ కు ఆ సమయంలో విడదల రజనీకి సీటు కేటాయిస్తూ..ఎమ్మెల్సీ పదవి పైన జగన్ హామీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు.

*నాలుగో స్థానం దక్కేదెవరికి
తాజాగా.. ఆయనకు క్రిష్ణా – మచిలీపట్నం ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు కేటాయించారు. కమ్మ వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు రాజ్యసభ సీటు ఇస్తారని పార్టీలో కొందరు నేతలు చెబుతున్నారు. కానీ, ఇదే సమయంలో బీసీ లేదా ఎస్సీ – మైనార్టీ వర్గాల నుంచి ఒకరికి రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీ నటుడు ఆలీకి గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పటంతో… ఆలీకి రాజ్యసభ ఇస్తారనే చర్చ కొద్ది కాలం క్రితం వరకు బలంగా వినిపించింది. ఆలీకి ఇవ్వటం ద్వారా మైనార్టీ .. సినీ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.

*ఢిల్లీ పర్యటనలో క్లారిటీ
ఇక, ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికతో పాటుగా రాజ్యసభ సీట్ల కేటాయింపు పైన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగో సీటు ఎస్సీ వర్గానికి ఇవ్వాలని భావిస్తే డొక్క మాణిక్య వరప్రసాద్.. బీసీ కోటాలో బీదా మస్తాన రావు పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. దీంతో..సీఎం చివరకు వీరిలో ఎవరి పేర్లు రాజ్యసభకు ఖరారు చేస్తారనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.