Health

ఈ గింజ‌ల‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌కండి.. ఇవి తింటే ఎన్ని లాభాలో..!

ఈ గింజ‌ల‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌కండి.. ఇవి తింటే ఎన్ని లాభాలో..!

తామర గింజలను ఫాక్స్‌ నట్‌, గొర్గాన్‌ నట్‌, మఖానా, ఫూల్‌ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్తారు. కాబట్టి ఇది పూర్తి సేంద్రియ పంట. ఈ గింజలలో ఔషధ గుణాలు అపారమని చెబుతారు నిపుణులు. తక్కువ సోడియం, ఎక్కువ మెగ్నీషియం ఉండటం వల్ల గుండె రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారికి ఉపయోగకరం. యాంటీ ఆక్సిడెంట్లుగా పిలిచే ఫ్లెవనాయిడ్లు శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్‌ ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడతాయి. పిండిపదార్థాలు పుష్కలంగా ఉండే అన్నం, బ్రెడ్‌ వగైరా ఆహార పదార్థాలతో పోలిస్తే తామర గింజల్లో ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. దీంతో మధుమేహ రోగులకు ప్రయోజనకరం. మూత్రపిండాలకు చాలా మంచిది. అతిసారం, మూత్ర విసర్జన సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. రోజుకు 25 గ్రాముల తామర గింజలు తీసుకుంటే ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటున్నట్లే. నిద్రలేమి, గుండెదడ, చికాకు తదితర సమస్యలను తామర గింజలు తగ్గిస్తాయని ఆయుర్వేదం కూడా భరోసా ఇస్తున్నది.ఆహారంలో భాగంగా… తామర గింజలను పచ్చిగా కానీ, వేయించి కానీ తినొచ్చు. పొడిగా, టానిక్‌లా, పేస్టులా వాడుకోవచ్చు. పాప్‌కార్న్‌ కంటే తామర గింజలు శ్రేష్ఠమైనవి. వీటిని అలవాటు చేస్తే.. పిల్లలను జంక్‌ చిప్స్‌ నుంచి దూరంగా ఉంచవచ్చు. పప్పులు, సోయాబీన్‌, సజ్జ, జొన్న మొదలైన వాటితో తామర గింజలను మిశ్రమం చేస్తే పోషకాల విలువ మరింత పెరుగుతుంది.