Health

‘ఇప్ప’.. గొప్పెంతో…!

‘ఇప్ప’.. గొప్పెంతో…!

భద్రాచలం రాములవారి గుడి దగ్గర ఇప్పపూల ప్రసాదాలు అమ్మడమూ, ఇప్ప పువ్వుతో గిరిజనులు సారా చేస్తారన్నదీ చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్ప పువ్వుని వంటల్లోనూ వాడుతుంటారు. అందుకే’ప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుందనే సామెతలూ పుట్టుకొచ్చాయి. అధర్వణ వేదం మొదలుకుని చరక సంహిత వరకూ ఎన్నో గ్రంథాల్లో ఇప్ప పూల ప్రస్తావన ఉంది. కేవలం రుచే కాదు … గిరిజనులు కల్పవృక్షంగా భావించే ఈ చెట్టు ఆకులూ, బెరడూ, పువ్వులూ, కాయలూ … అన్నింటిలోనూ పోషక విలువలు ఎక్కువేనట. ముఖ్యంగా పువ్వుల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, కెరోటిన్, విటమిన్ – సి … వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పూర్వకాలం నుంచీ ఆదివాసీలు ఈ పువ్వులను శక్తినిచ్చే ఆహారంగా భావించి అనేక రకాలుగా వాడుకుంటారు. ఇప్ప పూలు దగ్గు, శ్వాసకోశ సమస్యల్ని నివారిస్తాయట. బాలింతల్లో పాలు వృద్ధి కావడానికి పాలల్లో కాస్త ఇప్పపూల పొడిని కలిపి ఇస్తారు. ఈ పూలను మరిగించి చల్లార్చిన కషాయం తాగితే అతిదాహం తగ్గుతుంది. రక్త సంబంధిత సమస్యలకీ ఈ కషాయం చక్కటి ఔషధం. అలానే చర్మ సంరక్షణకూ, కీళ్ల నొప్పుల నియంత్రణకూ ఇప్ప తైలాన్ని వాడుతుంటారు . ఈ నూనెను పంట పొలాల్లో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. ఇప్ప పూలతో కుడుములు, జొన్న రొట్టె ఉండలు, జంతికలు … వంటివెన్నో చేసుకుంటారు . గిరిజనులు, వర్షాకాలంలో ఈ పూలకి చిక్కుడు గింజలు, బొబ్బర్లనీ కలిపి అంబలి కాచుకుంటారు . ఏ కూరగాయలు అందుబాటులో లేకపోతే ఇప్పపువ్వు వేసి అన్నం వండుతారు. ఇప్పుడు ఆధునికులు సైతం ఇప్ప పూలలోని రుచిని పోషకాల్ని గుర్తించి వాటితో జామ్లూ, కేక్లూ, ఇన్ఫ్యూజ్డ్ ఐస్క్రీమ్లూ … ఇలా ఎన్నో రకాలు చేస్తున్నారు. గొప్ప విషయమే కదూ!
N3