NRI-NRT

ఆస్ట్రేలియా ఎన్నికలు.. లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది

ఆస్ట్రేలియా ఎన్నికలు.. లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది

ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారిగా ఎన్నికల్లో గెలుపొందింది. కాగా ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియాలో ప్రతి మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 151 స్థానాలున్న దిగువ సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా ఆ దేశంలోని 1.70 కోట్ల మంది ఓటర్లలో 48శాతంపైగా ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఓటువేసేందుకు అనేకమంది లోదుస్తుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం చర్చనీయాంశమైంది. మహిళలు స్విమ్‌సూట్‌ ధరించగా, పురుషులు కేవలం అండర్‌వేర్‌లో వచ్చి ఓటేశారు.
voting
‘బడ్జీ స్మగ్లర్స్​’ అనే స్విమ్​వేర్​ కంపెనీ ఇచ్చిన ఓ ఆఫరే వందల మంది లోదుస్తుల్లో రావడానికి కారణమైంది. అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కాగా ఈ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్‌వేర్‌లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫొటోలను #SmugglersDecide హ్యాష్​ట్యాగ్​తో పోస్ట్ చేశారు. తమ ఆఫర్​కు అనూహ్య స్పందన వచ్చిందంటూ బడ్జీ స్మగ్లర్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఒకరిద్దరు పాల్గొంటారని భావిస్తే వందల మంది ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేసింది. ఈ ఛాలెంజ్​లో పాల్గొన్నవారందరికీ సోమవారం నుంచి బహుమతులు అందజేస్తామని తెలిపింది.